బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Mar 24, 2020 , 01:23:22

చైనా జాప్యం కొంపముంచింది!

చైనా జాప్యం కొంపముంచింది!

  • కరోనాపై చాలాకాలం పాటు వివరాలను వెల్లడించలేదు
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపణ

వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ గురించి సమాచారాన్ని పంచుకోవడంలో చైనా ఆలస్యం చేయడం తనను కొంత ఆవేదనకు గురి చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ వైరస్‌ నియంత్రణ కోసం తాము పంపించిన వైద్య నిపుణుల బృందాన్ని అనుమతించకపోవడం చైనా అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు. ఆదివారం ఆయన వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌ విషయమై చైనా అత్యంత రహస్యంగా వ్యవహరించడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. అయితే, చైనాతో తమ ద్వైపాక్షిక సంబంధాలు చాలా మంచిగా ఉన్నాయన్నారు. చైనా త్వరితగతిన వైరస్‌ గురించి చెప్పి ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ప్రాణాలను కాపాడగలిగి ఉండేవారమన్నారు. ఇప్పటి వరకు అమెరికాలో కరోనా వల్ల 390 మంది మరణించగా, 31,057 వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. న్యూయార్క్‌ రాష్ట్రం కరోనా వైరస్‌కు కేంద్రంగా మారింది. దేశంలోని కరోనా వైరస మృతుల్లో సగం మంది ఈ రాష్ర్టానికి చెందిన వారే.

ట్రంప్‌ ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి సెనేట్‌లో చుక్కెదురు

కరోనా నేపథ్యంలో సంక్షోభంలో కూరుకుపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు ప్రతిపాదించిన ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి సెనేట్‌లో చుక్కెదురైంది. డెమోక్రాట్ల నుంచి దీనికి మద్దతు లభించలేదు. అలాగే అధికార రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు క్వారంటైన్‌లో ఉండడం వల్ల ఓటింగ్‌లో పాల్గొనలేదు. ప్రస్తుత సంక్షోభం సమయంలో లక్షలాది మంది ప్రజలను రక్షించడంలో, వైద్యారోగ్య వ్యవస్థను మెరుగుపరచడంలో రిపబ్లికన్ల ప్రణాళిక విఫలమైందని డెమొక్రాట్లు విమర్శించారు. 


logo
>>>>>>