మంగళవారం 31 మార్చి 2020
International - Mar 17, 2020 , 13:03:25

చైనీస్ వైర‌స్ అన్న ట్రంప్‌.. డ్రాగ‌న్ సీరియ‌స్‌

చైనీస్ వైర‌స్ అన్న ట్రంప్‌..  డ్రాగ‌న్ సీరియ‌స్‌

హైద‌రాబాద్‌:  చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్ర బిందువుగా.. నోవెల్ క‌రోనా వైర‌స్‌ వ్యాప్తి చెందిన విష‌యం తెలిసిందే. అయితే క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ దేశాలు వ‌ణికిపోతున్నాయి. ఆ వైర‌స్‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఓ మ‌హ‌మ్మారిగా ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో అగ్ర‌రాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్‌.. ఓ వివాదాస్ప‌ద కామెంట్ చేశారు.  కోవిడ్‌19 వ్యాధిని చైనీస్ వైర‌స్ అంటూ ఆయ‌న సంబోధించారు.  చైనీస్ వైర‌స్ వ‌ల్ల అమెరికా పరిశ్ర‌మ‌లు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయంటూ ఆయ‌న ఘాటుగా స్పందించారు.  దీనిపై డ్రాగ‌న్ దేశం ట్రంప్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నది.  ట్రంప్ వ్యాఖ్య‌లు స‌రైన రీతిలో లేనట్లు ఆరోపించింది.

క‌రోనా వ‌ల్ల ఎయిర్‌లైన్స్‌తో పాటు న‌ష్ట‌పోయిన‌ ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌కు శ‌క్తివంత‌మైన స‌పోర్ట్ ఇస్తామ‌ని ట్రంప్ తాజాగా త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.  అయితే అదే ట్వీట్‌లో ఆయ‌న వివాదాస్ప‌ద మాట‌ను కూడా వాడారు.  చైనీస్ వైర‌స్ వ‌ల్ల ప్ర‌భావానికి లోనైన ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆదుకుంటామ‌న్నారు.  చైనా సీనియ‌ర్ దౌత్య‌వేత్త యంగ్ జేచీ .. క‌రోనాపై అమెరికా చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు.  కోవిడ్‌19 నియంత్ర‌ణ‌కు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని, కానీ ట్రంప్ కామెంట్స్ స‌రైన రీతిలో లేవ‌ని ఆయ‌న ఆ దేశ విదేశాంగ‌మంత్రితో పేర్కొన్నారు.  చైనాను బ‌ద్నామ్ చేయాల‌ని చూస్తే, దాన్ని కౌంట‌ర్ చేస్తామ‌న్నారు.  వైర‌స్ నియంత్ర‌ణ‌కు క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌న్నారు.

క‌రోనాపై ట్రంప్ కామెంట్‌ చేయ‌డంతో.. ట్విట్ట‌ర్‌లో రియాక్ష‌న్లు వెల్లువ‌లా వ‌చ్చాయి. కొంద‌రు అమెరికా అధ్య‌క్షుడిని స‌మ‌ర్థించారు.  మ‌హ‌మ్మారిని చైనీస్ వైర‌స్ అన‌డం జాత్యాంహ‌కార‌మే అవుతుంద‌ని మ‌రికొంద‌రు విమ‌ర్శించారు. ట్రంప్ కామెంట్‌ను త‌ప్పుప‌ట్టిన వారిలో  కూల్ క్విట్ ఫౌండ‌ర్ యూజీన్‌, రోలింగ్ స్టోన్ రైట‌ర్ జామిల్ స్మిత్ లాంటి వాళ్లు ఉన్నారు.  క‌రోనా గురించి మాట్లాడిన‌ప్పుడు చాలా స్ప‌ష్ట‌మైన భాష‌ను వాడాల‌ని ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. వైర‌స్ పేరుతో ఎవ‌ర్నీ దూషిస్తున్న‌ట్లు చేయకూడ‌ద‌న్న‌ది.  వైర‌స్ గురించి మాట్లాడుతున్న‌ప్పుడు,  కేవ‌లం సైంటిఫిక్ డేటా ఆధారిత స‌మాచారాన్ని మాత్ర‌మే సంబోధించాల‌ని సూచించింది. ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని కించ‌ప‌రిచే రీతిలో కామెంట్లు చేయ‌కూడ‌దని డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రించింది. మ‌రోవైపు వుహాన్ న‌గ‌రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.


logo
>>>>>>