శుక్రవారం 04 డిసెంబర్ 2020
International - Oct 23, 2020 , 08:13:18

కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నా : ట్రంప్‌

కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నా : ట్రంప్‌

వాష్టింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ మధ్య నాష్‌విల్లేలో తుది సంవాదం నాస్‌విల్లేలో జరిగింది. రెండు నిమిషాల పాటు అంతరాయం లేకుండా మాట్లాడే నిబంధనతో చర్చ కొనసాగింది. ట్రంప్‌, బైడెన్‌ మధ్య కొవిడ్‌ సన్నద్ధత, అమెరికా కుటుంబాలు, పర్యావరణ మార్పులు, జాతీయ భద్రతా, నాయకత్వం సహా ఆరు ప్రశ్నలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ కరోనా నివారణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన వైరస్‌ కట్టడి కోసం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థనే కొన్నాళ్ల పాటు మూసివేశామన్నారు.

ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య ప్రపంచమంతా ఉందన్నారు. ఇదో ప్రపంచ సమస్య అని, అయితే మహమ్మారిని ఎదుర్కొవడంలో నా ప్రభుత్వం తీసుకున్న చర్యలను చాలామంది దేశాధినేతలు ప్రశంసించారని గుర్తు చేశారు. తాను కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నానని, అమెరికాలో కరోనా మరణాల రేటు తగ్గిందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లోనే కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. కొన్ని వారాల్లోనే వాక్సిన్‌ను అందుబాటులోకి వస్తుందని ట్రంప్‌ చెప్పారు. ఆర్మీ సాయంతో వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అమెరికాలో 99శాతం మంది యువత కరోనాను జయించిందని ప్రకటించారు. త్వరలోనే విద్యాసంస్థలు తిరిగి తెరవనున్నట్లు తెలిపారు. 

ట్రంప్‌ వైఫల్యంతోనే ‘కరోనా’లో మొదటిస్థానం

ట్రంప్‌ ప్రభుత్వం వైఫల్యంతోనే కరోనా కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో నిలిచిందని డెమొక్రాట్‌ అభ్యర్థి జోబైడెన్‌ విమర్శించారు. రోజుకు వెయ్యి మందికిపైగా చనిపోతున్న పరిస్థితుల్లో మనం ఉన్నామని, ప్రతి రోజు 70వేల కేసులు నమోదవుతున్నాయన్నారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ట్రంప్‌ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని ఆరోపించారు. మహమ్మారి విషయంలో చాలా ఆలస్యంగా ప్రభుత్వం మేలుకుందన్నారు. కరోనా మహమ్మారిపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించలేదని విమర్శించారు. చైనా నుంచి రాకపోకలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోయారన్నారు. కరోనా ప్రమాదకారి అని ఇంత వరకు ట్రంప్‌ చెప్పలేదన్నారు.

ఇప్పటికీ కరోనా వల్ల ప్రమాదం లేదనే ట్రంప్‌ చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలు ఎల్లప్పుడూ మాస్క్‌ ధరించేలా ప్రోత్సహిస్తామని, ర్యాపిడ్‌ టెస్టులు పెంచి వాటిల్లో పెట్టుబడులు పెడుతామన్నారు. సురక్షితంగా వ్యాపారాలు, పాఠశాలలను ప్రారంభించేలా జాతీయ స్థాయిలో ప్రమాణాలను రూపొందిస్తామని హామీ ఇస్తున్నామన్నారు. చాలా మంది మరణాలకు కారణమైన ఎవరైనా యునైటెడ్‌ స్టేట్స్‌కు అధ్యక్షుడిగా ఉండకూదన్నారు. ట్రంప్‌ శతాబ్దంలో దేశం అత్యంత ఘోరమైన ఆరోగ్య సంక్షోభం నిర్వహణను సమర్థించారన్నారు. చైనాలో ట్రంప్‌కు రహస్య ఖాతా ఉందని, ఫెడరల్‌ ట్యాక్స్‌ ఏడాదికి 750 డాలర్లు మాత్రమే చెల్లించారని ఆరోపించారు. ట్రంప్‌ తాను ఏడాదికి 10లక్షల డాలర్ల పన్ను చెల్లిస్తున్నానని, గత నాలుగు సంవత్సరాలుగా చెల్లిస్తున్న పన్నులను ప్రకటిస్తారని చెప్పారు. ఎక్కడ, ఎలా ప్రకటిస్తానో చెప్పేందుకు నిరాకరించారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.