గురువారం 29 అక్టోబర్ 2020
International - Oct 01, 2020 , 02:27:32

నువ్వో జోకర్‌.. నువ్వు ఫూల్‌!

నువ్వో జోకర్‌.. నువ్వు ఫూల్‌!

  • తిట్లదండకంగా అమెరికా అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్‌, బిడెన్‌ సంవాదం  
  • l వ్యక్తిగత విమర్శలతో రణరంగంగా చర్చా వేదిక 
  • l కరోనా, పర్యావరణం, బ్యాలెట్‌ విధానంపై కొనసాగిన చర్చ 

క్లీవ్‌లాండ్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతమైంది. మంగళవారం జరిగిన అధ్యక్ష అభ్యర్థుల ముఖాముఖి సంవాదం ఆద్యంతం యుద్ధ భూమిని తలపించింది. తెంపరితనానికి మారుపేరుగా నిలిచిన ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తన హద్దులను దాటి ఊగిపోయారు. కొన్నిసార్లు డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ కూడా సంయమనం కోల్పోయారు. గంటన్నరపాటు జరిగిన ఈ సంవాదాన్ని అమెరికా చరిత్రలోనే చెత్త డిబేట్‌గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. 

కరోనా సంక్షోభం

ట్రంప్‌: మేము అప్రమత్తంగా ఉండటంవల్లే దేశంలో మరణాలు తగ్గాయి. లేకపోతే లక్షల మంది మృతి చెందేవారు. చైనా, భారత్‌, రష్యాలో కరోనాతో ఎంత మంది మరణించారో ఎవరికీ తెలియదు.    

బిడెన్‌: కొవిడ్‌-19 నియంత్రణలో ట్రంప్‌ పూర్తిగా విఫలమయ్యారు. ఈ విషయంలో ఆయనకు ఎలాంటి ప్రణాళిక లేదు. ప్రజల ఆరోగ్యం, మాస్కు నిబంధనలను ఆయన పట్టించుకోలేదు. 

వాణిజ్యం-ఉద్యోగాలు

ట్రంప్‌: కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటున్నది. తయారీ రంగంలో అమెరికన్లకు ఏడు లక్షల ఉద్యోగాలు  వచ్చేలా చేశాను. 

బిడెన్‌: మేము అధికారంలోకి వస్తే ట్రంప్‌ కంటే 70 లక్షల ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాం. కార్పొరేట్‌ పన్నును 21 శాతానికి తగ్గిస్తాం. 

వర్ణ వివక్ష - దాడులు

ట్రంప్‌: ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే సమాజంలో ఎంతో అంతరం ఏర్పడింది. వర్ణవివక్ష విధానాలను సంస్కరించే పనిలో ఉన్నాం.

బిడెన్‌: ట్రంప్‌ హయాంలో ఆఫ్రో-అమెరికన్లు వివక్షకు గురయ్యారు. మేము అధికారంలోకి రాగానే పౌరహక్కుల సంఘాలు, పోలీసు విభాగంతో సమావేశం నిర్వహిస్తాం. 

పర్యావరణం

ట్రంప్‌: పారిస్‌ ఒప్పందం దారుణమైనది. పర్యావరణం పేరిట వ్యాపారాలను దెబ్బతీయొద్దు.అయితే, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. 

బిడెన్‌: అధికారంలోకి రాగానే పారిస్‌ ఒప్పందంలో తిరిగి చేరుతాం. పర్యావరణంపై ట్రంప్‌ ఆలోచనలు తప్పు. 

ఎన్నికల్లో బ్యాలెట్‌ విధానం

ట్రంప్‌: బ్యాలెట్‌ విధానం అసంబద్ధమైనది. దీని వల్ల నాకు వ్యతిరేకంగా ఫలితాలు వస్తే ఎంతమాత్రం అంగీకరించబోను.

బిడెన్‌: బ్యాలెట్‌ విధానంలో మోసాలకు తావులేదు. నేను గెలిచినా, ఓడినా సంపూర్ణంగా అంగీకరిస్తా. 

తిట్ల పురాణం-వ్యక్తిగత విమర్శలు

ట్రంప్‌: బిడెన్‌ను ఉద్దేశిస్తూ.. నోరు మూసుకో, తెలివైనవాడివేమీ కాదు, చదువులో మొద్దు, అబద్ధాలకోరు.

బిడెన్‌: ట్రంప్‌ను ఉద్దేశిస్తూ.. అసత్యవాది, జాత్యహంకారి, జోకర్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేతిలో కుక్క పిల్ల, ఫూల్‌.