సోమవారం 19 అక్టోబర్ 2020
International - Sep 30, 2020 , 11:12:32

హోరాహోరీగా తొలి డిబేట్.. ట్రంప్‌ను జోక‌ర‌న్న బైడెన్‌

హోరాహోరీగా తొలి డిబేట్..  ట్రంప్‌ను జోక‌ర‌న్న బైడెన్‌

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ప్ర‌త్య‌ర్థి జోసెఫ్ బైడెన్ మ‌ధ్య తొలి అధ్య‌క్ష చ‌ర్చ ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. అధ్య‌క్ష అభ్య‌ర్థులు ఇద్ద‌రూ హోరాహ‌రీగా ప‌లు అంశాల‌పై పోటీప‌డ్డారు.  ఒక‌రిపై ఒక‌రు నింద‌లు వేసుకుంటూ.. చ‌ర్చ‌లో నిప్పులు చెరిగారు. ఒక‌రిపై ఒక‌రు గ‌ట్టిగా కూడా అరుచుకున్నారు.  క‌రోనా మ‌హ‌మ్మారి, జాతివివ‌క్ష‌, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌కు సంబంధించిన అంశాల‌పై ట్రంప్‌, బైడెన్‌లు చ‌ర్చించారు. సుమారు 90 నిమిషాల పాటు అత్యంత ఆస‌క్తిక‌రంగా తొలి చ‌ర్చ సాగింది.  ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో ఈ చ‌ర్చ జ‌రిగింది. 

బైడెన్ ఓ ద‌శ‌లో అధ్య‌క్షుడు ట్రంప్‌ను జోక‌ర్‌(క్లౌన్‌) అని కామెంట్ చేశారు.  నోరుమూసుకోమంటూ కూడా బైడెన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ట్రంప్ కూడా గ‌ట్టిగా బ‌దులిస్తూ.. బైడెన్ కుమారుడు డ్ర‌గ్ కేసులో దోషిగా తేలిన‌ట్లు తెలిపారు. అయితే తొలి చ‌ర్చ‌లో బైడెన్ స్వ‌ల్ప ఆధిక్యాన్ని సాధించిన‌ట్లు ఓపీనియ‌న్ పోల్స్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఎన్నిక‌ల‌కు ఇంకా 35 రోజుల స‌మ‌యం ఉన్న‌ది. కానీ ప్ర‌స్తుతం రెండు పార్టీల మ‌ధ్య హోరాహోరీగా పోరు ఉంద‌ని రాజ‌కీయ పండితులు విశ్లేషిస్తున్నారు. చ‌ర్చ‌లో ఆరు సెగ్మంట్ల‌పై చ‌ర్చ చేప‌ట్టారు. ఒక్కొక్క సెగ్మంట్‌పై 15 నిమిషాలు మాట్లాడారు.  అభ్య‌ర్థుల రికార్డు, సుప్రీంకోర్టు, మ‌హమ్మారి, జాతివివ‌క్ష‌, ఎన్నిక‌ల స‌మ‌గ్ర‌త‌, ఆర్థిక వ్య‌వ‌స్థ అంశాల‌పై తొలుత చ‌ర్చించారు.  

చ‌ర్చ‌లో ట్రంప్‌పై బైడెన్ ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు.  దేశంలో జాతివివ‌క్ష విద్వేషాన్ని పెంచిన‌ట్లు ఆరోపించారు.  పుతిన్‌కు కీలుబొమ్మ‌లా ట్రంప్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని బైడెన్ విమ‌ర్శించారు.  అమెరికా అధ్య‌క్షుల్లో అత్యంత ప‌నికిరాని అధ్య‌క్షుడివంటూ ట్రంప్‌పై బైడెన్ విమ‌ర్శ‌లు చేశారు. క‌రోనా వైర‌స్ గురించి ఇద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తిక‌రంగా చ‌ర్చ జ‌రిగింది.  ట్రంప్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే క‌రోనాతో అమెరికాలో రెండు ల‌క్ష‌ల మంది చ‌నిపోయిన‌ట్లు బైడెన్ ఆరోపించారు. స్టాక్‌మార్కెట్ల ప‌ట్ల ట్రంప్ భ‌య‌ప‌డిన‌ట్లు తెలిపారు. మ‌ర‌ణాల‌ను ఆపేందుకు ట్రంప్ స్మార్ట్‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని బైడెన్ వేసిన పంచ్‌ను త‌ప్పుప‌ట్టారు. స్మార్ట్ అన్న ప‌దాన్ని త‌న ప‌ట్ల వాడ‌కూడ‌ద‌ని బైడెన్‌కు ట్రంప్ హెచ్చ‌రించారు. వ్యాక్సిన్ గురించి కూడా ఇద్ద‌రూ చ‌ర్చించారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను ఓపెన్ చేయ‌డాన్ని బైడెన్ త‌ప్పుప‌ట్టారు. కానీ దేశాన్ని ష‌ట్‌డౌన్ చేయ‌లేమ‌ని ట్రంప్ చెప్పారు. 


logo