శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 16, 2020 , 02:02:51

మనోళ్లే కింగ్‌ మేకర్స్‌!

మనోళ్లే కింగ్‌ మేకర్స్‌!

  • అమెరికాలో 40 లక్షలమంది ఎన్నారైలు 
  • ఏడు ప్రధాన రాష్ర్టాల్లో వారి ఓటింగే కీలకం
  • భారతీయుల మద్దతు కోసం ఇరుపార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు

నవంబర్‌లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించనున్నారు. కమలా హారిస్‌ కంటే తనకే ఎక్కువమంది భారతీయుల మద్దతు ఉన్నదని అధ్యక్షుడు ట్రంప్‌ శనివారం పేర్కొనడం, భారతీయ మూలాలున్న కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా జో బిడెన్‌ ఎంపిక చేయడాన్ని చూస్తే అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయుల ఓట్ల ప్రాధాన్యతను అర్థంచేసుకోవచ్చు.

ఏడు రాష్ర్టాలు కీలకం

అమెరికాలో మొత్తం 50 రాష్ర్టాలుండగా.. ఆ దేశ జనాభా 33 కోట్లు. ఇందులో ప్రవాస భారతీయుల సంఖ్య దాదాపు 40 లక్షలు. భారతీయ ఓటర్లు ఎక్కువగా ఉన్న కాలిఫోర్నియా, న్యూయార్క్‌, టెక్సాస్‌, ఫ్లోరిడా రాష్ర్టాల్లో నమోదయ్యే ఓటింగ్‌ అమెరికా అధ్యక్షుణ్ణి నిర్ణయిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని భారతీయుల్లో ఈ రాష్ర్టాల్లోనే దాదాపు సగం మంది ఉన్నారు.

ట్రంప్‌ ఎత్తుగడలు ఇలా..

అమెరికా వలస విధానాలను కఠినతరం చేయడం, హెచ్‌ 1బీ వీసాల జారీపై ఆంక్షలు తదితరాల వల్ల ట్రంప్‌ నాయకత్వంపై ప్రవాస భారతీయులు గుర్రుగా ఉన్నారు. దీన్ని కొంతవరకు చల్లబర్చేందుకే గతేడాది టెక్సాస్‌లో నిర్వహించిన ‘హౌడీ-మోదీ’ సభలో ప్రధాని మోదీతో కలిసి ట్రంప్‌ వేదికను పంచుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సతీసమేతంగా ట్రంప్‌ భారత్‌లో పర్యటించారు. 

బిడెన్‌ అస్ర్తాలు ఇవే

ప్రవాస భారతీయుల ఓట్లను చేజిక్కించుకోవడంలో భాగంగానే ఉపాధ్యక్ష పదవికి భారతీయ మూలాలున్న కమలా హారిస్‌ను బిడెన్‌ నామినేట్‌ చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. తాము అధికారంలోకి రాగానే హెచ్‌ 1బీ వీసా జారీలో సంస్కరణలను తీసుకురావడంతో పాటు గ్రీన్‌ కార్డుల జారీలో ఇప్పటివరకూ పాటిస్తున్న ‘దేశం-కోటా’ విధానాన్ని రద్దు చేసి జనాభా, దరఖాస్తుల ప్రాతిపదికన కార్డులను మంజూరు చేస్తామని డెమొక్రటిక్‌ పార్టీ నేతలు శనివారం వెల్లడించారు. దీనివల్ల అత్యధికంగా లబ్ధి పొందే దేశం భారత్‌.

నాకే మద్దతు ఎక్కువ: ట్రంప్‌ 

బిడెన్‌ అధ్యక్షుడైతే పోలీసు విభాగాన్ని నిర్వీర్యం చేస్తాడు. కమల అరంగేట్రమే అధ్వాన్నం. ఆమె కంటే ఎక్కువ మంది భారతీయులు నాకు మద్దతుగా ఉన్నారు 

వైఫల్యాలమయం: బిడెన్‌ 

ట్రంప్‌ పరిపాలన వైఫల్యాలమయం. వారసత్వంగా వచ్చే గొప్పవాటిని కూడా ఆయన సులువుగా నాశనం చేస్తారు.


logo