ఆదివారం 29 మార్చి 2020
International - Jan 24, 2020 , 02:06:46

జన్మతః అమెరికా పౌరసత్వం ఇక కష్టమే!

జన్మతః అమెరికా పౌరసత్వం ఇక కష్టమే!
  • కాన్పు కోసమే వచ్చే గర్భవతులకు వీసా ఇవ్వబోమని అమెరికా ప్రకటన
  • నిబంధనలను సవరించిన ట్రంప్

వాషింగ్టన్, జనవరి 23: తమకు పుట్టే పిల్లలకు జన్మతః అమెరికా పౌరసత్వం లభించేలా.. ఆ దేశానికి వెళ్లి పిల్లల్ని కనాలనుకునే మహిళల ఆశలపై ట్రంప్ సర్కార్ నీళ్లు గుమ్మరిస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఈ విధంగా.. పిల్లలకు పౌరసత్వం దక్కించుకోవటం కోసమే అమెరికాకు వచ్చే విదేశీ గర్భవతులకు టూరిస్టు వీసాలను అందజేయబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు వీసా నిబంధనలను అమెరికా ప్రభుత్వం గురువారం సవరించింది. అమెరికా రాజ్యాంగం ప్రకా రం.. ఆ దేశంలో జన్మించే శిశువులకు జన్మతః అమెరికా పౌరసత్వం లభిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకొని చైనా, రష్యా, భారత్ తదితర దేశాలకు చెందిన మహిళలు ముఖ్యంగా గర్భవతులు అమెరికాలో తమ ప్రసవం జరిగేలా ఆ దేశానికి వెళ్తుంటారు. దీనివల్ల వారికి జన్మించిన శిశువులకు సహజంగానే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఇప్పటివరకూ దీనిపై అమెరికాలో ఆంక్షలు కూడా లేవు. బర్త్‌టూరిజం పేరిట ఇది విస్తృతస్థాయిలో కొనసాగుతూ వచ్చింది. దీనిపైనే ఆధారపడి అనేక ట్రావెల్ ఏజెన్సీలు కూడా నడుస్తున్నాయి. అయితే, ట్రంప్ హయాంలో.. అమెరికాకు వలసవచ్చే వారిపై అనేక ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, తాజాగా గర్భవతులకు అందించే వీసాలపైనా కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. వీటిప్రకారం.. కాన్పు కోసమే వచ్చే గర్భవతులకు వీసాలను ఇవ్వరు. ఒకవేళ వైద్య అవసరాల కోసం అమెరికాకు వస్తున్నామని గర్భవతులు దరఖాస్తు చేసుకున్నట్లయితే.. ఆ చికిత్సకు అవసరమైన డబ్బులు, అక్కడ ఉన్నన్నాళ్లు అయ్యే వ్యయం భరించే స్థోమత తమకు ఉందని నిరూపించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.


logo