సోమవారం 01 జూన్ 2020
International - Apr 27, 2020 , 01:08:08

రిసార్ట్‌లో కిమ్‌!

రిసార్ట్‌లో కిమ్‌!

సియోల్‌: ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన ఎక్కడున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆ దేశ వ్యవహారాలపై అధ్యయనం చేసే ‘38 నార్త్‌' అనే వెబ్‌సైట్‌ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. కిమ్‌ కుటుంబ సభ్యులకు మాత్రమే సేవలందించే ఒక రైలు గత వారం నుంచి తూర్పు తీరంలోని వోన్‌సన్‌ రిసార్ట్‌ స్టేషన్‌లో నిలిపి ఉంచినట్లు తెలిపింది. ఈ మేరకు శాటిలైట్‌ ఫొటోలను విడుదల చేసింది. అయితే కిమ్‌ ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ‘ఆ రైలు ఆచూకీ ద్వారా కిమ్‌ అక్కడే ఉన్నారని చెప్పలేం. ఆయన ఆరోగ్యంపైనా అంచనాకు రాలేం. అయితే ఆయన ఆ ప్రాంతంలోనే ఉన్నారన్న వార్తలకు ఇది బలం చేకూరుస్తున్నది’ అని ఆ వెబ్‌సైట్‌ పేర్కొన్నది. ఈ నెల 15న తన తాత కిమ్‌ సంగ్‌ -2 జయంతి వేడుకులకు కిమ్‌ హాజరుకాకపోవడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు మొదలయ్యాయి. కిమ్‌ కోసం చైనా వైద్య బృందం ఉత్తరకొరియాకు వెళ్లినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. logo