శనివారం 24 అక్టోబర్ 2020
International - Oct 10, 2020 , 02:14:13

ఆకలి తీర్చే చేయికి.. శాంతి కంకణం

ఆకలి తీర్చే చేయికి.. శాంతి కంకణం

  • వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌కు శాంతి నోబెల్‌ 
  • అన్నార్తుల ఆకలి తీరుస్తున్న సంస్థ 
  • ఏటా పదికోట్ల మందికి ఆహారం అందజేత
  • రోమ్‌ కేంద్రంగా 88 దేశాల్లో కార్యకలాపాలు

రోమ్‌, అక్టోబర్‌ 8: మానవ, ప్రకృతి సంక్షోభాలతో డొక్కలు మాడి దిక్కులు చూస్తున్న కోట్లమందికి నేనున్నానంటూ ఆకలి తీరుస్తున్న వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ)కి ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. ఇటలీలోని రోమ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. 2019లో ఒక్క ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా 88 దేశాల్లో 10 కోట్ల మంది ఆకలి తీర్చి అపర అన్నపూర్ణగా నిలిచింది. ‘ఈ అవార్డు ప్రకటన ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆకలిబాధలు పడుతున్న కోట్లమంది బాధితులవైపు నోబెల్‌ కమిటీ కూడా దృష్టి సారించింది’ అని పురస్కారాన్ని ప్రకటిస్తూ నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ చైర్మన్‌ బెరిట్‌ రెయిస్‌ ఆండర్సన్‌ వ్యాఖ్యానించారు. ఆహారభద్రతే శాంతిమంత్రంగా డబ్ల్యూఎఫ్‌పీ బహుముఖ పాత్రను పోషిస్తున్నదని ప్రశంసించారు. నోబెల్‌ అవార్డు రావటం పట్ల డబ్ల్యూఎఫ్‌పీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బీస్‌లి సంతోషం వ్యక్తం చేశారు.  అవార్డు కింద డబ్ల్యూఎఫ్‌పీకి ప్రశంసాపత్రం, రూ.8 కోట్లు అందించనున్నారు.

ఆకలి ఉన్నచోటే డబ్ల్యూఎఫ్‌పీ 

2019లో ప్రపంచవ్యాప్తంగా  దాదాపు 13.5 కోట్ల మంది ఆకలితో అలమటించారు. కరోనా కారణంగా ఈ ఆకలిబాధలు మరింత పెరిగాయని బీస్‌లీ తెలిపారు. ముఖ్యంగా అంతర్యుద్ధాలతో తల్లడిల్లుతున్న యెమెన్‌, కాంగో, నైజీరియా, దక్షిణసూడాన్‌, బుర్కినాఫాసో తదితర దేశాల్లో ప్రజల ఆకలి తీర్చేందుకు డబ్ల్యూఎఫ్‌పీ తీవ్రంగా కృషిచేస్తున్నది. నోబెల్‌ పురస్కారాన్ని ప్రకటించిన సమయంలో సంస్థ డైరెక్టర్‌ నైగర్‌లో ప్రజల ఆకలి తీర్చే పనిలో ఉండటం గమనార్హం. ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి కోసం 211 మంది వ్యక్తులు, 107 సంస్థలు పోటీపడ్డాయి. 

అతిపెద్ద మానవతా సంస్థ 

డబ్ల్యూఎఫ్‌పీ ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సహాయ సంస్థ. 1960లో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ కాన్ఫరెన్స్‌ను నిర్వహించిన తర్వాత  ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1961లో రోమ్‌ కేంద్రంగా దీనిని ఏర్పాటుచేశారు. ఈ సంస్థ 88 దేశాల్లో కలిపి ఏటా సగటున 10 కోట్ల మంది ఆకలి తీరుస్తున్నది. ఈ సంస్థలో సభ్యులైన 36 దేశాల ప్రతినిధులతో ఎగ్జిక్యూటివ్‌ బోర్డును ఏర్పాటుచేస్తారు. అమెరికాలోని దక్షిణ కరోలినా గవర్నర్‌గా పనిచేసిన డేవిడ్‌ బీస్‌లీ ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సంస్థలో 17,000 మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నారు.


logo