శనివారం 06 జూన్ 2020
International - May 15, 2020 , 12:23:38

చైనా కట్టడికి భారత్‌కు అమెరికా సైనికసాయం

చైనా కట్టడికి భారత్‌కు అమెరికా సైనికసాయం

హైదరాబాద్: చైనాను కట్టడి చేయాలంటే ఇండియాతో సైనికబంధం బలోపేతం చేయాలని అమెరికా సెనేటర్ థామ్ టిలిస్ చెప్పారు. 'అబద్ధాలు, మోసం, నిజాలను కప్పేయడం' ద్వారా కోవిడ్-19 విశ్వ మహమ్మారికి కారణమైన చైనాను జవాబుదారీగా నిలబెట్టేందుకు ఆయన 18 సూత్రాల ప్రణాళికను అమెరికా ప్రభుత్వానికి ప్రతిపాదించారు. చైనా నుంచి పరిశ్రమల తరలింపుతో పాటుగా భారత్‌, వియత్నాం, తైవాన్‌లకు సైనికసాయం అందించడం వంటి అంశాలు అందులో ముఖ్యమైనవి. గురువారం తన ప్రణాళికను ఆవిష్కరించే సందర్భంలో ఆయన చైనాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చైనా ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా అన్నీ దాచిపెట్టడం వల్ల విశ్వ మహమ్మారి వ్యాపించిందని, అనేకమంది అమెరికన్లు కడగండ్ల పాలయ్యారని సెనేటర్ టిలిస్ పేర్కొన్నారు. ఆ ప్రభుత్వమే తన సొంత పౌరులను నిర్బంధ శ్రామిక శిబిరాల్లో పెడుతున్నదని, అమెరికా టెక్నాలజీని, ఉద్యోగాలను దొంగిలిస్తున్నదని అన్నారు. అమెరికా మిత్రదేశాల సార్వభౌమత్వానికి ముప్పు తెస్తున్నదని మండిపడ్డారు. అమెరికాకు, మిగతా స్వేచ్ఛాప్రపంచానికి ఇదొక కనువిప్పులాంటిదని చెప్పారు. తన కార్యాచరణ ప్రణాళిక చైనాను జవాబుదారీగా నిలబెట్టేందుకు ఉద్దేశించిందని, అమెరికా ఆర్థికవ్యవస్థను, ప్రజారోగ్యాన్ని, జాతీయ భద్రతను కాపాడడం దాని లక్ష్యమని వివరించారు. చైనాపై ఆంక్షలు విధించాలని ప్రతిపాదించారు. పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం కట్టడికి చొరవ చేపట్టాలని తెలిపారు. అమెరికా సైన్యం కోరుతున్న 20 బిలియన్ డాలర్ల (రూ.లక్షన్నర కోట్లు) నిధులను మజూరు చేయాలని సెనేటర్ టిలిస్ సూచించారు. ప్రాంతీయ మిత్రదేశాలతో సైనికబంధాన్ని బలోపేతం చేసుకోవాలని, ఇండియా, తైవాన్, వియత్నాంలకు సైనిక ఆయుధాలు సరఫరా చేయాలని తెలిపారు. జపాన్‌ను మళ్లీ సైన్యాన్ని వృద్ధి చేసుకోమని చెప్పాలని  మరో కీలక సూచన చేశారు. చైనా నుంచి అమెరికా కంపెనీలను వెనుకకు పిలిపించుకోవాలని, చైనాపై ఆధారపడడం తగ్గించుకోవాలని తెలిపారు. చైనా అమెరికా టెక్నాలజీని దొంగిలించకుండా కాపాడాలని చెప్పారు. సాంకేతిక ఆధిపత్య సాధించేందుకు అమెరికా కంపెనీలకు రాయితీలు కల్పించాలని చెప్పారు. చైనా హ్యాకింగ్ లకు వ్యతిరేకంగా సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని అన్నారు. అమెరికా ప్రజల పన్నుల సొమ్ముతో చైనా తన అప్పులు తీర్చకుండా చూడాలి. చైనా టెక్నాలజీ కంపెనీ హువావెయ్‌పై నిషేధాన్ని అమలు చేయాలని, మిత్రదేశాలతో అలాంటి నిషేధాలు అమలు చేయించాలని చెప్పారు. వైరస్ గురించి అబద్ధాలు చెప్పినందుకు  చైనా నుంచి పరిహారం రాబట్టాలని, ఆంక్షలు విధించాలని చెప్పారు. దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనకు కూడా ఆంక్షలు విధించాలి. 2022 శీతాకాలపు ఓలింపిక్స్ ను చైనా నుంచి మార్చాలని ఐఓసీకి చెప్పాలి. అమెరికా గడ్డమీద చైనా ప్రచారాన్ని అడ్డుకోవాలి. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని మీడియా సంస్థలను ప్రాపగండా అంగాలుగా చూడాలి అని ట్రంప్ ప్రభుత్వానికి సూచించారు.


logo