శనివారం 23 జనవరి 2021
International - Dec 04, 2020 , 12:27:13

ప‌బ్లిక్‌గా వ్యాక్సిన్ వేసుకుంటామ‌న్న అమెరికా మాజీ అధ్య‌క్షులు

ప‌బ్లిక్‌గా వ్యాక్సిన్ వేసుకుంటామ‌న్న అమెరికా మాజీ అధ్య‌క్షులు

వాషింగ్ట‌న్‌: క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప‌బ్లిగ్గా వేసుకుంటామ‌ని ముగ్గురు అమెరికా మాజీ అధ్య‌క్షులు ప్ర‌క‌టించారు. వ్యాక్సిన్‌పై ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెంచ‌డానికి వాళ్లు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఓ టీవీ షోలో మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే నేను ప‌బ్లిగ్గా దానిని వేసుకుంటాను అని ప్ర‌క‌టించారు. టీవీలో ప్ర‌త్యక్షంగా చూపిస్తున్న‌పుడు లేదా వీడియో రికార్డ్ చేస్తూ అయినా తాను వ్యాక్సిన్ వేసుకుంటానని ఆయ‌న చెప్పారు. నేను ఈ సైన్స్‌ను న‌మ్ముతాన‌ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డానికే ఈ ప‌ని చేస్తాను అని అన్నారు. త్వ‌ర‌లోనే అమెరికా ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్.. ఫైజ‌ర్‌, మోడెర్నాల‌కు చెందిన వ్యాక్సిన్‌ల‌ను వినియోగానికి అనుమ‌తి ఇచ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఒబామా ఈ వ్యాఖ్య‌లు చేశారు. అటు మరో మాజీ అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్ కూడా ప‌బ్లిగ్గా టీకా వేసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు ఆయ‌న అధికార ప్ర‌తినిధి ఏంజెల్ యురెనా వెల్ల‌డించారు. ఒక‌వేళ అది అమెరిక‌న్ల‌లో విశ్వాసం పెంచ‌డానికి తోడ్ప‌డితే.. క్లింట‌న్ టీకాను ప‌బ్లిగ్గా వేసుకుంటార‌ని చెప్పారు. మ‌రో మాజీ అధ్య‌క్షుడు జార్జ్ బుష్ కూడా ఇదే ప్ర‌క‌ట‌న చేశారు. 


logo