శనివారం 28 మార్చి 2020
International - Feb 21, 2020 , 03:24:07

బాలల ఆరోగ్యానికి ముప్పు

బాలల ఆరోగ్యానికి ముప్పు
  • భారత్‌కు ఐరాస హెచ్చరిక
  • పిల్లల ఎదుగుదల సూచీలో 131వ స్థానం
  • సుస్థిరాభివృద్ధి సూచీలో 77వ ర్యాంకు

ఐరాస, ఫిబ్రవరి 20: భారత్‌లో చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని ఐక్యరాజ్యసమితి (ఐరాస) నివేదిక హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యూనిసెఫ్‌), ద లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌ సహాయంతో వివిధ దేశాలకు చెందిన 40 మంది శిశు, బాలల ఆరోగ్య నిపుణులు 180 దేశాల్లో అధ్యయనం చేసి బాలల ఎదుగుదల సూచీ (చైల్డ్‌ ఫ్లరిషింగ్‌ ఇండెక్స్‌), సుస్థిరాభివృద్ధి సూచీని విడుదల చేసింది. ఈ ర్యాంకులు తాజాగా విడుదలయ్యాయి. భారత్‌.. బాలల ఎదుగుదల సూచీలో 131, సుస్థిరాభివృద్ధిలో 77వ స్థానంలో నిలిచింది. 

మనకన్నా నేపాల్‌, భూటాన్‌ మెరుగు

బాలల ఎదుగుదల సూచీకి సంబంధించి.. ఆయా దేశాల్లో ఐదేండ్లలోపు చిన్నారుల ఆరోగ్యం, తల్లుల ఆరోగ్యం, అందుబాటులో మాతాశిశు ఆరోగ్య సేవలు, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పేదరికం, ఆత్మహత్యలు, విద్య, పోషణ, హింస నుంచి రక్షణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సూచీలో భారత్‌ 131వ స్థానంలో నిలిచింది. మన పొరుగున ఉన్న శ్రీలంక (68), చైనా (43), భూటాన్‌ (113), మనదేశం కన్నా ముందు ఉండటం గమనార్హం. పాకిస్థాన్‌ (140), బంగ్లాదేశ్‌ (143), నేపాల్‌ (144) మాత్రమే వెనుక ఉన్నాయి. ఈ జాబితాలో నార్వే మొదటిస్థానంలో నిలిచింది. 

విచ్చలవిడిగా కర్బన ఉద్గారాల విడుదల 

సుస్థిరాభివృద్ధి సూచీకి సంబంధించి.. ఆయా దేశాలు విడుదల చేస్తున్న తలసరి కర్బన ఉద్గారాల పరిమాణం, 2030 నాటికి సాధించాల్సిన లక్ష్యాలతో పోల్చితే ఆయా దేశాల పనితీరు ఎలా ఉన్నదో పరిశీలించారు. తలసరి కర్బన ఉద్గారాల పరిమాణం ఆధారంగా లెక్కించినప్పుడు.. ఆఫ్రికా దేశాలైన బురుండి, చాద్‌, సోమాలియా అగ్రస్థానంలో ఉండగా.. ఖతార్‌ అట్టడుగున నిలిచింది. భారత్‌ 77వ ర్యాంకు సాధించింది. 

ప్రమాదకరంగా టీవీ ప్రకటనలు 

టీవీలు, ఇతర మాధ్యమాల్లో వస్తున్న వేలాది ప్రకటనలు బాలలను తప్పుదోవ పట్టిస్తున్నాయని నివేదిక హెచ్చరించింది. దీంతో చిన్నారులు చిరుతిండ్లు, శీతల పానీయాలు, ఇతర అనారోగ్యకరమైన ఆహారపదార్థాలకు ఆకర్షితులై అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని తెలిపింది. 1975లో ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు, పెద్దలు కలిపి 1.10 కోట్ల మంది ఊబకాయులు ఉంటే, 2016నాటికి 11 రెట్లు పెరిగి ఈ సంఖ్య 12.4 కోట్లకు చేరిందని వెల్లడించింది. తప్పుడు ప్రకటన ప్రభావం యువతపై సైతం ఉంటున్నదని హెచ్చరించింది. 


logo