మంగళవారం 24 నవంబర్ 2020
International - Oct 25, 2020 , 17:22:49

నమీబియా బీచ్‌లో వేలాది ఆడ సీల్స్ మృతి

నమీబియా బీచ్‌లో వేలాది ఆడ సీల్స్ మృతి

జోహన్నెస్‌బర్గ్: నమీబియాలో వేల సంఖ్యలో ఆడ సీల్స్ మరణించాయి. సముద్ర తీరంలోని బ్రీడింగ్ కాలనీ వద్ద సుమారు ఏడు వేల కేప్ ఫర్ సీల్స్ చనిపోయాయి. వాల్విస్ బే నగరానికి సమీపంలోని పెలికాన్ పాయింట్ కాలనీ ఇసుక బీచ్‌లో కుప్పలుగా మరణించిన సీల్స్‌ను సముద్ర పరిరక్షణకు చెందిన నౌడ్ డ్రేయర్ సెప్టెంబర్‌లో గుర్తించారు. అనంతరం అక్టోబర్ తొలి రెండు వారాల్లో పెద్ద సంఖ్యలో సీల్ పిండాలను చూసినట్లు నమీబియా డాల్ఫిన్ ప్రాజెక్టుకు చెందిన డాక్టర్ టెస్ గ్రిడ్లీ తెలిపారు. సాధారణంగా సీల్స్ నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ మధ్యకాలంలో పిల్లలకు జన్మనిస్తాయని చెప్పారు. అయితే అసహజంగా సుమారు ఏడు వేల ఆడ సీల్స్ పిల్లలను కనేందుకు బీచ్ వద్దకు వచ్చి మరణించినట్లు తెలిపారు.


మరోవైపు ఇలా పెద్ద సంఖ్యలో గర్భంతో ఉన్న ఆడ సీల్స్ చనిపోవడం వెనుక కారణం ఏమిటన్నది తెలియడం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. కాలుష్యం, ఆహారలేమి లేదా బ్యాక్టీరియా సోకడం కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఆ సముద్ర తీరంలో తగిన సంఖ్యలో చేపలు లేక ఆహారం కొరత వల్లనే సీల్స్ మరణించి ఉంటాయని నమీబియా మత్స్యశాఖ మంత్రి తెలిపారు. మరణించిన సీల్స్‌కు పరీక్ష అనంతరం దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు.

 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.