మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Nov 10, 2020 , 16:25:30

ఈయన జపాన్‌ జో బైడెన్‌.. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌

ఈయన జపాన్‌ జో బైడెన్‌.. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌

టోక్యో : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం.. జపాన్‌లోని ఓ రాజకీయ నాయకుడిని వెలుగులోకి తెచ్చింది. ఈయన పేరు సోషల్‌ మీడియాలో మార్మోగిపోవడంతో ఎన్నడూ లేనంత ప్రచారం దక్కింది. తన పేరు సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్నదని అతడి కుటుంబీకులు చెప్పేంతవరకు తన పేరు  బైడెన్‌ అని ఉచ్చరించవచ్చునని తెలియదంటున్నారాయన. జపాన్‌ దేశం నైరుతిలో ఉన్న యమటో అనే చిన్న పట్టణానికి చెందిన 73 ఏళ్ల యుటాకా ఉమెడా సోషల్‌ మీడియాలో సంచలనంగా మారారు. కంజీ అక్షరాలను ఉపయోగించి వ్రాసినప్పుడు ఇతని పేరును జో బైడెన్‌ అని ఉచ్చరించవచ్చని గుర్తించారు. 

చైనాలో ఉద్భవించిన కంజీ పాత్ర తరుచుగా పలు ఫొనెటిక్ రీడింగులను కలిగి ఉంటుంది. ఈయన పేరులోని మొదటి పదం యుకాటా ఒకే అక్షరం 穣. దీనిని సాధారణంగా 'జో' అని ఉచ్ఛరిస్తారు. కాగా, అతని ఇంటిపేరు 梅田, "ప్లం" "ఫీల్డ్" అనే రెండు అక్షరాలను కలిగి ఉంటుంది. దీనిని "ఉమే" "డా" గా చదవవచ్చు, అలాగే "బాయ్‌"  "డెన్" అని కూడా చదువవచ్చు. దాంతో చాలా మంది జపాన్‌లోని ఈ పెద్దాయనను జపాన్‌ జో బైడెన్‌గా ముద్దుగా పిలుచుకుంటున్నారట."నేను అతనితో చాలా సన్నిహితంగా ఉన్నట్లు భావిస్తున్నాను" అని క్యోడో వార్తా సంస్థతో ఉమేడా పేర్కొన్నారు. "నేను కూడా ఎన్నికల్లో గెలిచినట్లు అనిపిస్తుంది" ఉమేడా సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అధ్యక్ష అభ్యర్థిగా మారినప్పుడు జపాన్‌లోని ఒబామా పట్టణానికి లభించిన గుర్తింపు.. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నిక కావడంతో తన పేరు యమటోకు సహాయపడుతుందని ఉమెడా భావిస్తున్నారు. 

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కమలా హారిస్‌లను జపాన్ ప్రధాని యోషిహిదే సుగా ఆదివారం అభినందించారు. "జో బైడెన్, కమలా హారిస్‌లకు హృదయపూర్వక అభినందనలు. జపాన్-అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను. కూటమి, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో, వెలుపల శాంతి, స్వేచ్ఛ, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దాం" అని ఆయన ట్వీట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.