గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 26, 2020 , 13:23:34

స్వీయ నియంత్రణ.. కిచెన్‌లోకి వెళ్లాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..

స్వీయ నియంత్రణ.. కిచెన్‌లోకి వెళ్లాలంటే ఈ నిబంధనలు పాటించాల్సిందే..

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు విస్తరించిన నేపథ్యంలో దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ఎక్కడికక్కడ ప్రజలు స్వీయ నియంత్రణలో ఉంటున్నారు. పిల్లలు, పెద్దలు ఇండ్లలోనే ఉండటంతో సందడి నెలకొంది. పిల్లలైతే ఇష్టమైన ఫుడ్‌ కోసం అమ్మల వద్ద గారాబం పడుతున్నారు. కిచెన్‌లోకి వెళ్లి అన్ని ఆహార పదార్థాలను లాగేస్తున్నారు. ముందే లాక్‌డౌన్‌.. మరి కిచెన్‌లోని ఆహార పదార్థాలు అయిపోతే ఏం చేయాలి? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. కాబట్టి ఇప్పుడు పిల్లలను వంటింట్లోకి వెళ్లకుండా కంట్రోల్‌ చేస్తున్నారు తల్లులు. ఓ తల్లి అయితే వినూత్నంగా వంట గది నియమాలు అంటూ చిన్న పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఆ పేపర్‌పై కేవలం నాలుగు నియమాలను మాత్రమే రాసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో వంటగది కొత్త నియమాలు అని టైటిల్‌ రాసి ఉంది. వంటింట్లో అతికించిన ఈ నియమాల పట్టిక నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. 

మొదటి నియమం(అనుమతి కోసం) : అనుమతి లేకుండా ఆహారం, స్నాక్స్‌ కోసం కిచెన్‌ గదిలోకి ఎవరూ వెళ్లకూడదు. విల్లీ, నిల్లీకి వంట గదిలోకి అనుమతి లేదు.

రెండో నియమం(వృధా గురించి) : చిరు ధాన్యాల బాక్సులను ఊరికే ఓపెన్‌ చేయరాదు. ఒక బాక్స్‌ పూర్తిగా అయిపోయిన తర్వాతనే మరో బాక్స్‌ను ఓపెన్‌ చేయాలి. 

మూడో నియమం(పోషకాహారం గురించి) : కిచెన్‌లోకి వచ్చే ముందు ఒక పండు ముక్క, లేదా కూరగాయ, లేదా పెరుగు తిని రావడం మంచిది.

నాలుగో నియమం(హెచ్చరిక గురించి) : మీలో ఎవరైనా కాడ్బరీ ఎగ్స్‌ను టచ్‌ చేస్తే కరోనా వైరస్‌ సోకి చనిపోతారు.

అయితే ఈ నాలుగు నియమాలపై నెటిజన్లు స్పందించారు. ఇప్పుడు ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. వంట గది నియమాలు బాగున్నాయని ప్రశంసలు కురిపించారు. ఈ పోస్టర్‌పై 2,500 మంది స్పందించగా, 1600 మంది షేర్‌ చేశారు. 950 మంది కామెంట్లు రాశారు. 


logo
>>>>>>