మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 12, 2020 , 14:45:33

ఈయన పొట్టలో మద్యం తయారవుతుంది..

ఈయన పొట్టలో మద్యం తయారవుతుంది..

న్యూజెర్సీ : ఈయన పేరు డానీ జియానోట్టో. అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తున్నాడు. గత ఏడాది మద్యం సేవించి కారు నడుపుతున్నాడని పోలీసులు గుర్తించారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేసేందుకు పోలీసులు రాగా.. అయ్యా బాబూ.. నేను మందు తాగలేదు.. కనీసం వాసన కూడా చూడలేదు.. నన్ను నమ్మండి.. అని తలబాదుకొన్నాడు. దాంతో డానీ మాటలు నమ్మిన పోలీసులు.. తాము కూడా నిర్ధారించుకుంటామని ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు పరీక్షలు జరిపి మద్యం సేవించాడని తేల్చారు. 

గమ్మత్తైన విషయమేమిటంటే.. నిజంగానే డానీ మద్యం సేవించలేదు. ఆయన శరీరంలోనే అలా మద్యం తయారవుతుందని కొన్నిరోజుల తర్వాత ఓ దవాఖానలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు తేల్చారు. ఇది చాలా అరుదైన పరిస్థితి అని, ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ (ఏబీఎస్) కారణంగా కడుపు తనలోని కార్బోహైడ్రేట్లను ఆల్కహాల్‌గా మారుస్తుందని వైద్యులు స్పష్టంచేశారు. ఈ విషయం తెలియగానే పోలీసులు డానీ జియానోట్టోపై చేసిన ఆరోపణలను విరమించుకున్నారు.

"పోలీసులు నన్ను అరెస్టు చేసినప్పుడు నమ్మలేకపోయాను. వివరించడానికి ప్రయత్నించినా పోలీసులు పట్టించుకోలేదు. దవాఖానలో పరీక్షల తర్వాత ఇలా కడుపులో ఆల్కహాల్ తయారవుతుందని తెలిసి నేనే కాదు అక్కడున్న వైద్యులంతా నివ్వెరబోయారు" అని డానీ చెప్పారు. 49 ఏళ్ల డానీ.. బాగెల్, పిజ్జా , పిండి పదార్థాలున్న ఏదైనా ఆహారం తీసుకోగానే ఆటోమేటిక్ గా ఈయన కడుపులో ఆల్కహాల్ స్థాయిలు పెరుగుతాయి. అంతకు ముందు తల్లి, భార్య కూడా మద్యం సేవిస్తున్నావంటూ పాపం డానీపై విసుక్కున్నారంట. మద్యం తాగలేదు అని నిరూపించుకునేందుకు డానీ.. జీవితంలో కార్బోహ్రైడ్రేట్లు ముట్టకూడదని ఒట్టేసుకున్నాడు. 


logo