శనివారం 31 అక్టోబర్ 2020
International - Oct 17, 2020 , 17:41:00

ఆ పట్టణంలో ఉండేది ఇద్దరే.. కానీ కొవిడ్‌ నిబంధనలు పక్కాగా పాటిస్తారు..!

ఆ పట్టణంలో ఉండేది ఇద్దరే.. కానీ కొవిడ్‌ నిబంధనలు పక్కాగా పాటిస్తారు..!

నార్టోస్‌: కొవిడ్‌-19 వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మాస్కు ధరించడం.. భౌతికదూరం పాటించడం తప్పనిసరి. కానీ చాలామంది వీటిని పాటించడంలేదు. అలాంటివారికి ఇటలీలోని ఇద్దరు వృద్ధులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక పట్టణంలో వీరిద్దరే ఉంటున్నారు.. కానీ వారు కలిసినప్పుడు కచ్చితంగా మాస్కు ధరిస్తున్నారు. భౌతికదూరం కూడా పాటిస్తున్నారు. 

జియోవన్నీ కారిల్లి (82), గియాంపిరో నోబిలి (74) ఉంబ్రియాలోని పెరుగియా ప్రావిన్స్‌లోగల ఓ పట్టణంలో నివసిస్తున్నారు. ఇది 900 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టం. ఆ ఇద్దరు ఉద్యోగ విరమణ చేశాక, కుటుంబాలను వదిలి ఇక్కడికి వచ్చి నివాసముంటున్నారు. వీరికి ఇరుగుపొరుగువారు ఎవరూ లేకున్నా ఇద్దరు కలిసినప్పుడు మాస్కులు ధరిస్తున్నారు. అలాగే, ఒక మీటర్ దూరం నుంచే మాట్లాడుకుంటున్నారు. కాఫీ తాగేందుకు వీరిద్దరు కలుసుకున్నప్పుడు రెండు మీటర్ల పొడవైన టేబుల్ చివరన కూర్చుంటారు. అలాగే, వీరు ప్రతిరోజూ మంచినీటిని సేకరించేందుకు పురాతన రోమన్‌ రాతి ఫౌంటేన్‌కు నడుచుకుంటూ వెళ్తారు. ఆ సమయంలోనూ భౌతికదూరం పాటిస్తున్నారు. ‘వైరస్‌ వల్ల తాము చనిపోతే ఇక్కడి గొర్రెలు..తోటలు.. చెట్లు..పుట్టగొడుగులను ఎవరు చూసుకుంటారు.. అందుకే కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆనందంగా కాలంగడుపుతున్నాం’ అని అంటున్నారు ఆ ఇద్దరు సీనియర్‌ సిటిజన్స్‌.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.