సోమవారం 30 నవంబర్ 2020
International - Nov 07, 2020 , 23:31:59

జో బైడెన్‌ నేపథ్యం ఇదే..

 జో బైడెన్‌ నేపథ్యం ఇదే..

న్యూయార్క్‌ : జోసెఫ్ రోబినెట్ బైడెన్ జూనియర్ 1942లో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని స్క్రాంటన్‌లో జన్మించారు. ఐర్లాండ్ నేపథ్యం ఉన్న ఓ కాథలిక్ కుటుంబంలో ఆయన జన్మించారు. బైడెన్‌కు చిన్నతనంలో నత్తి ఉండేది. స్కూల్‌ దశలో ఈ లోపం ఆయనను బాగా బాధించింది. ఈ సమస్యను అధిగమించేందుకు అద్దంముందు నిలుబడి తడబడకుండా మాట్లాడేందుకు ప్రయత్నించే వాడు. కొన్ని నెలల తరువాత ఈ లోపాన్ని అధిగమించాడు. బైడెన్, మొదట యూనివర్సిటీ ఆఫ్ డెలవేర్‌లో, తరువాత సిరక్యూస్ యూనివర్సిటీ లా స్కూల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. 

విల్మింగ్టన్‌ నుంచి రాజకీయ ప్రస్థానం..

మొదటి భార్య నెలియాను వివాహమాడిన తరువాత విల్మింగ్టన్‌ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. జో బైడెన్ 1972లో తొలిసారి సెనేటర్ ఎన్నికల్లో గెలిచారు. పదవిని స్వీకరించే సమయంలోనే కారు ప్రమాదంలో ఆయన భార్య, కూతురు మృతి చెందారు. కుమారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ తన బిడ్డలకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి గది నుంచే డెమొక్రటిక్ పార్టీ సెనేటర్‌గా బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. 

డెలవేర్ నుంచి వాషింగ్టన్‌కు నిత్య ప్రయాణం..

 బైడెన్ సెనెటర్‌ పదవి చేపట్టిన తరువాత వ్యక్తిగత జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. భార్య, కూతురి మరణం తరువాత తన కొడుకులిద్దరికీ మంచి జీవితం అందించాలనే తాపత్రయంతో సొంతిల్లున్న డెలవేర్ నుంచి వాషింగ్టన్‌కు నిత్యం ప్రయాణించే వారు. తదనంతరం, స్కూల్ టీచర్ అయిన జిల్ జాకబ్స్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత బైడెన్ జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగారు. 1987లో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి పోటీలో తొలిసారిగా అడుగు పెట్టే ప్రయత్నాలు చేశారు. 

ఆ కేసు విషయంలో సాక్ష్యాలను తొక్కిపట్టారు..

1991, అక్టోబర్ 11న యూనివర్సిటీ ఆఫ్ ఒక్లహామాలో న్యాయశాస్త్ర అధ్యాపకురాలు అనిటా హిల్, అమెరికా సుప్రీంకోర్టు న్యాయవాది క్లారెన్స్ థామస్ మీద వేసిన కేసు విచారణ జరుగుతోంది. రోనల్డ్ రీగన్ ప్రభుత్వంలో కలిసి పనిచేసినప్పుడు క్లారెన్స్ థామస్ తనను పలుమార్లు లైంగికంగా హింసించారని అనిటా హిల్ కేసు వేశారు. అమెరికాలో అందరూ ఈ కేసు విచారణ చూడటానికి టీవీలకు అతుక్కుపోయారు. అమెరికా సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ఈ విచారణ జరుపుతోంది. ఈ కమిటీ ఛైర్మన్‌గా జో బైడెన్ విచారణకు అధ్యక్షత వహించారు. అనిటా హిల్ సాక్ష్యాల విషయంలో బైడెన్ వ్యవహరించిన విధానం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అనిటా హిల్‌కు మద్దతుగా నిలిచిన పలువురు మహిళలను బైడెన్ సాక్ష్యం చెప్పడానికి పిలవలేదు. గతేడాది ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ కేసు గురించి మాట్లాడుతూ బైడెన్... ‘ఆవిడతో వ్యవహరించిన విధానానికి సిగ్గుపడుతున్నాను’ అని చెప్పారు. 

ఒబామా ప్రశంసలు..

2008లో బైడెన్ మళ్లీ అధ్యక్ష పోటీలో అడుగు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నం కూడా విజయవంతం కాలేదు. అయితే.. అప్పుడు డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న బరాక్ ఒబామా, తనకు తోడుగా ఉపాధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి జో బైడెన్‌ను ఎంచుకున్నారు. ఆ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ గెలిచింది. ఒబామా-బైడెన్ జంట ఆ తర్వాత 2012 అధ్యక్ష ఎన్నికల్లోనూ గెలిచింది. బైడెన్ అనేకమార్లు ఒబామాను తన సోదరునిగా అభివర్ణించారు. ఒబామా, తన అధ్యక్ష పదవి ఆఖరు రోజుల్లో బైడెన్‌కు అమెరికా దేశ అత్యున్నత పురస్కారమైన 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం' పురస్కారం ఇచ్చి సత్కరించారు. 

కుంగదీసిన కుమారుడి మృతి.. 

గొప్ప దశలోనూ బైడెన్‌కు వ్యక్తిగతమైన బాధలు తప్పలేదు. 2015లో ఆయన కుమారుడు బౌ బ్రెయిన్ 46 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మరణించారు. దీంతో బైడెన్‌ కొన్నాళ్లు చాలా కుంగిపోయారు. బౌ బైడెన్ రాజకీయాల్లో తన తండ్రికి వారసుడిగా కొనసాగుతారని అందరూ ఆశించారు. 2016లో బౌ డెలవేర్ రాష్ట్ర గవర్నర్‌గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంతలోనే ఈ విషాదం జరిగింది.