సోమవారం 25 జనవరి 2021
International - Nov 29, 2020 , 12:02:04

అలా చేస్తే ఇండియాను చైనా రెచ్చ‌గొడుతున్న‌ట్లే!

అలా చేస్తే ఇండియాను చైనా రెచ్చ‌గొడుతున్న‌ట్లే!

వాషింగ్ట‌న్‌: భార‌త స‌రిహ‌ద్దులోని ల‌ఢ‌ఖ్ ప్రాంతంలో చైనా నిర్మాణాల‌ను చేప‌డుతుంద‌న్న వార్త‌ల‌పై స్పందించారు అమెరికా చ‌ట్ట‌స‌భ‌ స‌భ్యుడు రాజ కృష్ణ‌మూర్తి. ఒక‌వేళ ఈ వార్త‌లు నిజ‌మే అయితే అది ఇండియాను చైనా రెచ్చ‌గొట్ట‌డ‌మే అవుతుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ద‌క్షిణ చైనా స‌ముద్రంలో ఎలాంటి క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిందో ఇప్పుడూ చైనా అలాగే చేస్తోంద‌ని కృష్ణ‌మూర్తి అన్నారు. ఈ ఏడాది మే నెల నుంచి తూర్పు ల‌ఢ‌ఖ్‌లోని వాస్త‌వాధీన రేఖ‌లో ఇండియా, చైనా మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. రెండు దేశాలు పెద్ద ఎత్తున బ‌ల‌గాల‌ను మోహ‌రించాయి. దీనిపై కాంగ్రెస్ డెమొక్ర‌టిక్‌ స‌భ్యుడు అయిన కృష్ణ‌మూర్తి స్పందించారు. ద‌క్షిణ చైనా స‌ముద్రంలోనూ ఇలాగే చైనా దీవుల‌ను నిర్మించింద‌ని, అక్క‌డి వాస్త‌వ ప‌రిస్థితుల‌ను మార్చే ప్ర‌య‌త్నం చేసింద‌ని ఆయ‌న చెప్పారు. 

శాటిలైట్ ఫొటోలు, త‌మ‌కున్న స‌మాచారం మేర‌కు స‌రిహ‌ద్దులో చైనా నిర్మాణాల‌కు పాల్ప‌డుతోంద‌న్న విష‌యం స్పష్ట‌మ‌వుతోంద‌ని కృష్ణ‌మూర్తి అన్నారు. డెమొక్ర‌టిక్ పార్టీ స‌భ్యుడైన కృష్ణ‌మూర్తి ఈ మ‌ధ్యే వ‌రుస‌గా మూడోసారి ప్ర‌తినిధుల స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఈ వివాదంలో అమెరికా క‌చ్చితంగా భార‌త్ వైపునే నిల‌బ‌డుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌.. సుదీర్ఘ కాలంగా ఇండియాకు మంచి మిత్రుడిగా ఉన్నాడ‌ని, ఆయ‌న‌తోపాటు వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన క‌మ‌లా హ్యారిస్‌.. ఇండియా వైపునే నిల‌బ‌డతార‌ని కృష్ణ‌మూర్తి అన్నారు. ఇప్ప‌టివర‌కు ఉన్న రిప‌బ్లిక‌న్‌, డెమొక్ర‌టిక్ పార్టీల అధ్య‌క్షులు ఎప్పుడూ భార‌త్ ప‌క్షానే నిల‌బ‌డ్డార‌ని, ఇక మీద‌ట కూడా చైనాతోపాటు ఏ ఇత‌ర పొరుగు దేశం కూడా ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డినా కూడా బైడెన్‌, హ్యారిస్ భార‌త్‌కే మ‌ద్ద‌తుగా నిలుస్తార‌ని ఆయ‌న చెప్పారు. 


logo