శుక్రవారం 22 జనవరి 2021
International - Dec 13, 2020 , 15:40:23

క‌రోనాపై అలుపెరుగ‌ని పోరు.. 260 రోజులుగా ప‌ని చేస్తూనే ఉన్న‌ డాక్ట‌ర్‌

క‌రోనాపై అలుపెరుగ‌ని పోరు.. 260 రోజులుగా ప‌ని చేస్తూనే ఉన్న‌ డాక్ట‌ర్‌

హూస్ట‌న్‌: ఏకంగా 260 రోజులు.. రోజుకు ఒక‌టి లేదా రెండు గంట‌ల నిద్ర‌.. దొరికింది తిని క‌డుపు నింపుకోవ‌డం.. క‌రోనా మ‌హ‌మ్మారిపై అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్న ఓ డాక్ట‌ర్ ఇక అలసిపోయానంటున్నారు. అమెరికాలోని టెక్స‌స్ రాష్ట్రంలో ఉన్న యునైటెడ్ మెమోరియ‌ల్ ఆసుప‌త్రి చీఫ్ డాక్ట‌ర్ జోసెఫ్ వేర‌న్‌.. ఒక్క రోజు కూడా సెల‌వు పెట్ట‌కుండా 260 రోజుల‌కుపైగా ప‌ని చేస్తూనే ఉన్నారు. త‌న‌తోపాటు ఇప్పుడు త‌న ఆసుప‌త్రిలోని సిబ్బంది కూడా పూర్తిగా అల‌సిపోయార‌ని వేర‌న్ అంటున్నారు. ఈ మ‌ధ్యే తాను చికిత్సి చేసిన ఓ పేషెంట్‌ను వేర‌న్ హ‌త్తుకొని ఓదారుస్తున్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ నేప‌థ్యంలో ఆసుప‌త్రిలో ఇంత ఒత్తిడిలోనూ ఆయ‌న ఎలా ప‌ని చేస్తున్నార‌న్న విష‌యం తెలుసుకోవ‌డానికి న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ ప్ర‌య‌త్నించింది. 

శుక్ర‌వారం డాక్ట‌ర్ వేర‌న్‌తోపాటు ఒక రోజంతా ఆసుప‌త్రిలోనే గ‌డిపారు ఆ ఏజెన్సీ రిపోర్ట‌ర్లు. తాను రోజుకు ఒక‌టి లేదా రెండు గంట‌లు మాత్ర‌మే నిద్ర‌పోతాన‌ని, స‌మ‌యానికి ఏది దొరికితే దానితోనే క‌డుపు నింపుకుంటాన‌ని ఈ సంద‌ర్భంగా వేర‌న్ చెప్పారు. టెక్స‌స్‌లో ఆ మ‌ధ్య క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో ఈ ఆసుప‌త్రి వారికి సాయం చేయ‌డానికి ప్ర‌త్యేకంగా ఓ ఆర్మీ టీమ్ వ‌చ్చింది. ఇప్పుడా టీమ్ కూడా వెళ్లిపోవ‌డంతో మ‌ళ్లీ డాక్ట‌ర్ వేర‌న్‌, ఆయ‌న టీమే నిరంత‌రాయంగా కొవిడ్ పేషెంట్ల‌కు చికిత్స చేస్తున్నారు. మా సిబ్బంది పూర్తిగా అల‌సిపోయారు. ప్ర‌తి రోజూ ప‌ని ఒత్తిడి త‌ట్టుకోలేక మా న‌ర్సులు ఏడుస్తున్నారు. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండ‌టంతో చికిత్స చేసి చేసి పూర్తిగా అల‌సిపోయామ‌ని డాక్ట‌ర్ వేర‌న్ చెబుతున్నారు. 

అమెరిక‌న్ ప్ర‌జ‌ల నిర్ల‌క్ష్యం వ‌ల్లే కేసులు ఇంత‌లా పెరిగిపోతున్నాయ‌ని ఆయన అంటున్నారు. మాస్కులు పెట్టుకొని, భౌతిక దూరం పాటిస్తే ఈ స‌మ‌స్య‌లే ఉండ‌వ‌ని ఆయ‌న చెప్పారు. మాస్కులు పెట్టుకోమ‌ని చెప్పినా వినని వాళ్లు చివ‌రికి త‌న ఐసీయూలోకి వ‌చ్చి చేరుతున్నార‌ని డాక్ట‌ర్ వేర‌న్ అన్నారు. ఇప్ప‌టికీ అమెరికా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉండ‌టంతో మ‌రో రెండు, మూడు నెల‌లు ఇలా ఏక‌ధాటిగా పని చేయ‌డం మిన‌హా త‌మ‌కు మ‌రో మార్గం లేద‌ని ఆయ‌న చెబుతున్నారు. 


logo