సోమవారం 18 జనవరి 2021
International - Dec 23, 2020 , 13:19:21

వ‌య‌సు 80 ఏళ్లు.. గ్యారేజ్‌లో 80 పోర్షె కార్లు

వ‌య‌సు 80 ఏళ్లు.. గ్యారేజ్‌లో 80 పోర్షె కార్లు

వియెనా: వ‌య‌సు కేవలం ఒక నంబ‌ర్ మాత్ర‌మే అని అంటుంటారు. ఆస్ట్రియాకు చెందిన ఈ పెద్ద మ‌నిషిని చూస్తే అది నిజ‌మే అనిపిస్తుంది. ఆయ‌న వ‌య‌సు 80 ఏళ్లు. సాధార‌ణంగా ఈ వ‌య‌సులో ఎవ‌రైనా ఏం చేస్తుంటారు?  హాయిగా కాలు మీద కాలు వేసుకొని త‌మ జీవితంలోని మ‌ధుర జ్ఞాపకాల‌ను నెమ‌రేసుకుంటూ శేష జీవితాన్ని గ‌డిపేస్తారు. కానీ ఒటోకార్ జే అనే 80 ఏళ్ల ఈ వృద్ధుడు మాత్రం అలా కాదు. ఈ వ‌య‌సులోనూ త‌న‌కెంతో ఇష్ట‌మైన పోర్షె కార్ల‌లో ర‌య్‌మంటూ తిరుగుతున్నాడు. ఆయ‌నకు ఈ ఖ‌రీదైన పోర్షె కార్లంటే ఎంత ఇష్ట‌మో తెలుసా? ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న 80 ఏళ్ల జీవితంలో ఏకంగా 80 పోర్షె కార్లు కొన్నాడు. ఈ మ‌ధ్యే త‌న 80వ పుట్టిన రోజును ఓ పోర్షె బాక్స్‌ట‌ర్ స్పైడ‌ర్ కారు కొనుగోలు చేసి జ‌రుపుకోవ‌డం విశేషం.

50 ఏళ్ల కింద‌ట తొలిసారి

త‌న‌కు ఈ పోర్షె కార్ల‌పై మోజు 50 ఏళ్లుగా ఉంద‌ని ఒటోకార్ జే చెబుతున్నాడు. అప్ప‌ట్లో ఒక‌రోజు ఓ పోర్షె కారు త‌న ప‌క్క‌గా దూసుకెళ్ల‌డం చూసి మ‌న‌సు పారేసుకున్న ఆయ‌న‌.. ఆ కారును ఎలాగైనా కొనాల‌ని నిర్ణ‌యించుకొని డ‌బ్బు జ‌మ‌చేయ‌డం ప్రారంభించాడు. కొన్నేళ్ల త‌ర్వాత 911 ఈ పోర్షె కారును కొన్నాడు. అదే అత‌ను కొన్న తొలి పోర్షె కారు. ఆ కారు తెగ నచ్చేయ‌డంతో ఆ త‌ర్వాత ఈ 50 ఏళ్ల‌లో మ‌రో 79 పోర్షె కార్లు కొనడం విశేషం. అందులో 917, 910, 904, 956లాంటి టాప్ మోడ‌ల్స్ అన్నీ ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న ద‌గ్గ‌ర 38 పోర్షె కార్లు ఉన్నాయి. నెల‌లో ప్ర‌తి రోజూ ఓ కారు వేసుకొని రోడ్డుపైకి వెళ్తాన‌ని, వీకెండ్స్‌లో అయితే రెండు కార్లు తీసుకెళ్తాన‌ని ఒటోకార్ గ‌ర్వంగా చెబుతున్నాడు. 

కార్ల కోస‌మే ఓ బిల్డింగ్‌

మ‌రి ఇన్ని కార్ల‌ను పార్క్ చేయ‌డానికి ఓ స్థ‌లం ఉండాలి క‌దా. అందుకే వీటి కోసమే ప్ర‌త్యేకంగా ఓ బిల్డింగే క‌ట్టాడు ఒటోకార్‌. దీనిని త‌న లివింగ్ రూమ్ అంటాడ‌త‌డు. త‌న అన్ని పోర్షె కార్ల క‌లెక్ష‌న్‌ను ఇక్క‌డ చూడొచ్చు. ఇందులోనే ఓ బొమ్మ‌ల దుకాణం, సినిమా స్క్రీన్ కూడా ఉండ‌టం విశేషం. కార్లు కొన‌డ‌మే కాదు.. అన్ని కార్ల‌నూ వాడ‌ట‌మూ ఒటోకార్‌కే చెల్లింది. వీటిలో త‌న‌కు 981 బాక్స్‌ట‌ర్ స్పైడ‌ర్ మోడ‌ల్ కార్ అంటే చాలా ఇష్ట‌మ‌ని ఆయ‌న చెబుతున్నాడు. 


ఇవి కూడా చ‌ద‌వండి

గుప్కార్ కూట‌మి ఏంటి? ఆ పేరెలా వ‌చ్చింది?

క‌శ్మీర్‌లో గుప్కార్.. అతిపెద్ద పార్టీగా బీజేపీ

600 డాల‌ర్లు కాదు.. ఒక్కొక్క‌రికి 2వేల డాల‌ర్లు ఇవ్వండి

రాహుల్‌గాంధీకి ఆలుగ‌డ్డ ఎట్ల పెరుగుత‌దో తెలియ‌దు: బీజేపీ