యూరోప్‌లో కరోనా.. క్రిస్మస్ సంబరాలు ఇలా

హైదరాబాద్: యూరోప్ దేశాల్లో ఇంకా కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉన్నది. అయితే క్రిస్మస్ పర్వదినం సమీపిస్తున్న నేపథ్యంలో.. అక్కడి దేశాధినేతలు తమ ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. పండగ వేళ ఎలా ఉండాలన్న అంశంపై మీకు మీరే వ్యక్తిగత నిర్ణయం తీసుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజల్ని కోరారు. క్రిస్మస్ పండగ వేళ బంధువులను కలిసే విషయాన్ని పరిశీలించుకోవాలన్నారు. బంధు సమ్మేళనాలపై ఆంక్షలను స్వల్పంగా ఉంచుతున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే నెలలో అయిదు రోజుల పాటు మూడు కుటుంబాలు ఒకే దగ్గరకు వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. డౌనింగ్ స్ట్రీట్ నుంచి వీడియో రిలీజ్ చేసిన బోరిస్.. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
క్రిస్మస్ బబుల్స్ కోసం బ్రిటన్ ప్రభుత్వం ప్లాన్ తయారు చేసింది. డిసెంబర్ 23 నుంచి 27 వరకు కేవలం మూడు ఫ్యామిలీలు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చారు. ఇండోర్స్‌లో కలుసుకుని, రాత్రిపూట ఎంజాయ్ చేసేందుకు వెసలుబాటు కల్పించారు. జర్మనీలో 16 రాష్ట్రాల అధినేతలు ఛాన్సలర్ మెర్కల్ ఇచ్చిన ఆదేశాల మేరకు లాక్డౌన్ పాటించనున్నారు. అయితే పండుగ వేళ మాత్రం రెండు కుటుంబాలు కలుసుకునే అవకాశం కల్పించారు. గత 24 గంటల్లో జర్మనీలో 410 మంది మరణించారు. దీంతో అక్కడ ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. ఇటలీలో తాజాగా అధిక సంఖ్యలో కేసులు నమోదు అయినా.. తాము మాత్రం సరైన మార్గంలో వెళ్తున్నట్లు ఆ దేశ సీనియర్ హెల్త్ అధికారులు తెలిపారు. ఇంటెన్సివ్ కేర్ కేసులు, హాస్పిటళ్లలో చేరే కేసులు కూడా తగ్గుతున్నట్లు తెలిపారు.
స్వీడన్లో కేసులు తగ్గుతున్నాయి. కానీ క్రిస్మస్ వేళ మాత్రం ఆంక్షలు పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బెల్జియంలో కూడా కేసులు తగ్గుతున్నా.. పండగ వేళ కోవిడ్ నియమావళిని పాటించనున్నారు.