గురువారం 04 జూన్ 2020
International - Apr 09, 2020 , 11:13:35

వారు శవాలను లెక్కపెట్టడం మానేశారట

వారు శవాలను లెక్కపెట్టడం మానేశారట

హైదరాబాద్: న్యూయార్క్ శవాల గుట్టగా మారుతున్నది. కరోనా మృతుల శవాలను వీధుల్లో నిలిపిన ఏసీ ట్రక్కుల్లో పెడుతున్నారు. బుష్‌విక్‌లోని పాష్ లొకాలిటీలో నివసించే ఓ జంటకు ఇది నిత్యదృశ్యమైపోయింది. అకౌంట్స్ సూపర్‌వైజర్ ఆలిక్స్ మాంటిలియోన్ (28), ఆమె ఫియాన్సీ  మార్క్ కొజ్లోవ్ (33) ఎంతో ఇష్టంగా కొనుక్కున్న అపార్టుమెంటులో ఉంటున్నారు. కిటికీలోంచి చూస్తే రోడ్ల మీద వాహనాలు, జనాలు కనిపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. న్యూయార్క్ వీధుల్లో మృత్యువు తాండవిస్తున్నది. వారిద్దరు కిటికీలోంచి బయటకు చూడాలంటేనే దడుసుకుంటున్నారు. కొన్నాళ్లపాటు అమ్మో అనుకుంటూ శవాలను లెక్కపెట్టడం లాంటిది చేశారు. కానీ ఇప్పుడు లెక్క మరిచిపోయారు. విహంగవీక్షణం లాంటి కిటికీవైపు చూడాలంటేనే భయం వేస్తున్నదని ఆ జంట ఇటీవల స్కైప్ ద్వారా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీడియాకు చెప్పారు. మా ఇంటి ముందర జరుగుతున్న తతంగం చూడాలంటేనే దడ కలుగుతున్నది. పక్కనే ఉన్న దవాఖానలో నుంచి నిరంతరంగా శవాలు వస్తూనే ఉంటాయి. వాటిని ట్రక్కుల్లో పేరుస్తూనే ఉంటారు. పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. ఇది వాస్తవం - అని వారు పేర్కొన్నారు. తక్షణం ఆ ఇల్లు ఖాళీ చేయమని సహోద్యోగులు, స్నేహితులు సూచించారట. కానీ ప్రస్తుతానికి ఇక్కడే ఉండక తప్పదని మాంటిలియోన్ చెప్పారు.


logo