బుధవారం 27 మే 2020
International - Apr 15, 2020 , 02:26:28

చైనాపై చర్యలుంటాయి

చైనాపై చర్యలుంటాయి

  • కరోనా నియంత్రణలో విఫలమయ్యారన్న మీడియాపై ట్రంప్‌ ఫైర్‌

వాషింగ్టన్‌: కరోనా గురించి ప్రపంచానికి తప్పుడు సమాచారం ఇచ్చిన చైనాపై చర్యలుంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. సోమవారం వైట్‌హౌస్‌లో మీడియా సమావేశం సందర్భంగా చైనాపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఓ రిపోర్టర్‌ అధ్యక్షుడ్ని పదేపదే అడిగారు. స్పందించిన ట్రంప్‌ ‘చైనాపై చర్యలు తీసుకోలేదన్నది నీకు తెలుసా? నేను ఏమీ చెప్పను. చైనాతోపాటు నువ్వు కూడా వాటిని గుర్తిస్తావు’ అని బదులిచ్చారు. మరోవైపు వైరస్‌ నియంత్రణలో విఫలమయ్యారన్న మీడియా కథనాలపై ట్రంప్‌ మండిపడ్డారు. అవన్నీ అవాస్తవాలంటూ, వైరస్‌ కట్టడికి తాము స్పందించిన తీరుపై వచ్చిన ప్రశంసలకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. కాగా, ఇది ట్రంప్‌ సొంత ప్రచారంమాదిరిగా ఉన్నదంటూ పలు మీడియా సంస్థలు విమర్శించాయి. మరోవైపు చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సహకారం గురించి తమకు అర్థంకావడం లేదంటూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ మండిపడ్డారు. వైరస్‌ వ్యాప్తికి మూలమైన వుహాన్‌లోని మార్కెట్లను తెరువడంపై ఎందుకు మద్దతిస్తున్నదని ప్రశ్నించారు. 


logo