బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Mar 02, 2020 , 01:29:10

కరోనా గుప్పిట ప్రపంచం

కరోనా గుప్పిట ప్రపంచం
  • అమెరికాలో తొలి మృతి నమోదు..
  • ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, థాయిలాండ్‌లో కూడా
  • ఇరాన్‌పై కొవిడ్‌ పంజా.. మృతుల సంఖ్యను తక్కువచేసి

అగ్రరాజ్యం సహా 70 దేశాల్ని వణికిస్తున్న వైరస్‌

వాషింగ్టన్‌/సిడ్ని/ఇస్లామాబాద్‌/బీజింగ్‌, మార్చి 1: కరోనా.. ఈ పేరు వింటేనే ప్రపంచం ఉలిక్కి పడుతున్నది. ప్రభుత్వాలు గడగడలాడుతున్నాయి. చైనాలో మొదలైన ఈ భయంకర మహమ్మారి.. ఇప్పుడు దాదాపు 70 దేశాలకు విస్తరించింది. ఇలా మొత్తంగా ప్రపంచాన్నే తన గుప్పిట్లోకి తీసుకున్నది. దీంతో అన్ని దేశాలు నియంత్రణ చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. తాజాగా ఈ వైరస్‌ సోకి అగ్రరాజ్యం అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌, థాయిలాండ్‌లో ఒక్కో పౌరుడు చొప్పున మరణించడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటలీలో బాధితుల సంఖ్య ఒక్కసారిగా 40శాతం పెరిగింది. 


ఉలిక్కిపడిన అగ్రరాజ్యం

అమెరికాలో తొలి కరోనా మరణం నమోదైంది. ఆ దేశ వైద్యాధికారులే ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే మృతుని వివరాలను తెలుపలేదు. వైరస్‌ సోకిన బాధితుల సంఖ్యపైనా స్పష్టతనివ్వలేదు. మరోవైపు ఇరాన్‌, దక్షిణ కొరియాకు అవసరమైతేతప్ప ప్రయాణించవద్దని పౌరులకు సూచించింది. 


ఆస్ట్రేలియాలో తొలి మరణం

కరోనాకు ప్రభావితమైన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌక నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వం దాదాపు 160 మందిని స్వదేశానికి తరలించింది. వైద్యుల పర్యవేక్షణలో వారికి చికిత్స అందిస్తు న్నది. వారిలో 78 ఏండ్ల వ్యక్తి మరణించినట్టు ఆదివారం అధికారులు ప్రకటించారు. దీంతో ఆస్ట్రేలియాలో తొలి కరోనా మరణం రికాైర్డెంది. మరోవైపు. ఐర్లాండ్‌, థాయిలాండ్‌లో సైతం మొదటి కరోనా మరణం నమోదైనట్టు అధికారులు ప్రకటించారు.


ఇరాన్‌లో విజృంభణ 

కరోనా వైరస్‌ సోకి ఆదివారం నాటికి 54మంది మరణించారని, వైరస్‌ సోకిన బాధితుల సంఖ్య 978కు చేరుకుందని ఇరాన్‌ అధికారులు పేర్కొన్నారు. అయితే, వాస్తవ సంఖ్యను దాచేస్త్తూ.. ఇరాన్‌ అబద్ధ్దాలు చెబుతున్నదని ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ ఆరోపించింది. ఆ దేశంలో ఇప్పటివరకూ 210 మందికి పైగా కరోనాతో చనిపోయారని చెప్పింది. ఆ దేశ దవాఖాన వర్గాలే తమకు ఈ సమాచారాన్ని ఇచ్చినట్టు పేర్కొంది. మరోవైపు, కరోనాతో ఇరాన్‌లో 300 మందికి పైగా మరణించారని, 15 వేల నుంచి 18 వేల మందికి ఈ వైరస్‌ సోకిందని మరికొన్ని సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని తీసుకురావడానికి చర్యలు ప్రారంభించినట్టు విదేశాంగ శాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, చైనాలో ఈ వైరస్‌బారిన పడి మరణించినవారి సంఖ్య 2,870కు చేరగా.. 79,824 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.


వ్యాక్సిన్‌ను కొనగలమా?

కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ మరో 90 రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని ఇటీవల ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే దీన్ని కొనుగోలు చేసే తాహతు ఎంతమందికి ఉండబోతుందోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై అమెరికా మానవ ఆరోగ్య సేవల విభాగం కార్యదర్శి అలెక్స్‌ స్పందించారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసే సామర్థ్యం అమెరికన్లకు లేదని చెప్పారు. ప్రైవేటు ఫార్మా సంస్థలు దీన్ని అభివృద్ధి చేస్తే టీకా ఖరీదు అంచనాలకు మించి ఉంటుందన్నారు.తలసరి ఆదాయం(అంచనా)57,379డాలర్లు(రూ.42,13,504)గాఉన్న అమెరికన్‌ పరిస్థితే ఇలా ఉంటే మిగతా వాళ్ల సంగతేంటని పలువురు వాపోతున్నారు. 


తప్పదు మరి!

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో దాయాది దేశం పాకిస్థాన్‌ ముందస్తు చర్యలు చేపట్టింది. దీంట్లో భాగంగా పొరుగునున్న ఆఫ్ఘనిస్థాన్‌ దేశంతో పంచుకుంటున్న సరిహద్దు మార్గాల్ని సోమవారం నుంచి వారంరోజులపాటు మూసేస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. ఇప్పటికే దేశంలో నలుగురికి కరోనా వ్యాధి లక్షణాలున్నట్టు గుర్తించామని, వైరస్‌ వ్యాప్తిని నియంత్రించాలంటే ఇలాంటి చర్యలు తీసుకోకతప్పదని అధికారులు పేర్కొన్నారు. 


దక్షిణ కొరియాలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. ఈ వైరస్‌ సోకి 17 మంది మరణించగా.. ఆదివారం కొత్తగా 376 మందికి ఈ వైరస్‌ సోకింది. దీంతో బాధితుల సంఖ్య 3,526కు చేరింది. దక్షిణ కొరియాలో వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో ఆ దేశానికి తమ పౌరులు వెళ్లకుండా దాదాపు 70కిపైగా దేశాలు ఆంక్షలు విధించాయి. 


70 దేశాల ఆంక్షలు ముద్దులతో స్వాగతాలు ఆపేయండి

ఫ్రాన్స్‌లో కరోనా క్రమంగా వ్యాపిస్తున్నది. దీంతో వైరస్‌ను అదుపు చేసేందుకు ఆ దేశం  కొన్ని ఆంక్షలు విధించింది. 5వేల కంటే ఎక్కువ మంది పాల్గొనే కార్యక్రమాల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, మిత్రులు, బంధువులకు చుంబనాలతో(ముద్దులతో)స్వాగతం, శుభాకాంక్షలు తెలిపే విధానానికి కొద్ది రోజుల పాటు స్వస్తి పలకాలని పౌరులకు విజ్ఞప్తి చేసింది.


నేను బాగానే ఉన్నాను మొర్రో..

ప్రఖ్యాత నటుడు జాకీచాన్‌కు కరోనా సోకినట్టు వస్తున్న వార్తలపై ఆదివారం ఆయన స్పందించారు. తాను ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నానని, కరోనా పేరుతో తనను ఎవరూ నిర్భందించలేదని తెలిపారు. వైరస్‌ సోకిందన్న కారణంతో తనకు వేలాది మంది అభిమానులు మాస్కులు పంపించారని, వాటిని అవసరమైన వాళ్లకు ఇవ్వాల్సిందిగా తన సిబ్బందికి చెప్పానని ఆయన పేర్కొన్నారు. logo