గురువారం 04 జూన్ 2020
International - Apr 16, 2020 , 14:45:50

ఆ దంపతుల అపురూప క్షణాలు అందరినీ హత్తుకున్నాయి..

ఆ దంపతుల అపురూప క్షణాలు అందరినీ హత్తుకున్నాయి..

హైదరాబాద్: రక్షణ కవచాల తెరలలో నుంచి చూపుల దొంతరలు.. పలు దొంతరల చేతితొడుగుల నుంచి ఒకింత స్పర్ష.. కరోనా కల్లోలంలో భార్యాభర్తలు క్షణకాలం ఒకరినొకరు లిప్తకాలం చూసుకోవడం ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. దంపతులిద్దరూ వైద్యసపర్యల పోరాటయోధులు.. ప్రాణాలకు తెగించి ప్రాణాలు పోస్తున్న అమృత హస్తాలు వారివి.. నిరంతర పోరాటంలో తమకంటూ సమయాన్ని కుదుర్చుకోలేని స్థితి. యుద్ధరంగం మధ్యలో పగలూరేయీ తెలియని పరుగులో ఒకానొక సుప్రభాతాన ఇద్దరూ ఎదురు పడ్డారు. ఆ నర్సు దంపతులు తృటిలో ఇలా చూపులు కలుపుకుని తిరిగి తమతమ దిక్కుకు వెళ్లిపోయారు. అతని పేరు బెన్ కేయర్.. ఆమె పేరు మిండీ బ్రాక్. ఓ సహోద్యోగి వారి ఈ అపురూప క్షణాలను కెమెరాలో బంధించి ప్రపంచానికి అందించారు. సోషల్ మీడియా కళ్లప్పగించింది. అందరమూ ఆ తుపాను వడిలో కొట్టుకుపోతున్నవాళ్లమే కదా అందుకే అంతగా నచ్చి ఉంటుందా దృశ్యం అన్నారు కేయర్. అందులో చిటికెడు ప్రేమ, పిడికెడు ఆశ ఉందికదా అని నవ్వేశారు. ఆ దంపతులు ఒక ఇంటిని, ఒక వృత్తిని, ఒక యుద్ధాన్ని పంచుకున్నారు. ఫ్లారిడాలోని టాంపా జనరల్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విధులకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఊపిరి అందనివారికి ప్రాణవాయువు సమకూర్చే నాళికలను అమర్చే కీలక విధులు నిర్వహిస్తున్నారు. ధన్యులు.


logo