బుధవారం 03 జూన్ 2020
International - Mar 31, 2020 , 22:52:59

ఇమ్రాన్ తీరును ఎండ‌గ‌ట్టిన పాక్ మీడియా

ఇమ్రాన్ తీరును ఎండ‌గ‌ట్టిన పాక్ మీడియా

తాను ఒక‌టి త‌లిస్తే..దైవం ఒక‌టి త‌లిచింద‌న్న సామెత ఒక‌టుంది. ఇది స‌రిగ్గా పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్‌కి స‌రిపోతుంది. క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగంగా భార‌త ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇమ్రాన్ సొంత భాష్యం చెప్పుకున్నాడు. క‌రోనా ఎదుర్కొనేందుకు భార‌త్‌లో లాక్‌డౌన్ అమలుచేస్తుండ‌గా, పాక్‌లో మాత్రం ఆంక్ష‌ల‌తో స‌రిపెట్టారు. పాకిస్థాన్‌లో ఇప్ప‌టికి 1,740  క‌రోనా పాజిటివ్ కేసులు,18 మంది మృతిచెందినా కూడా అక్క‌డ పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌లేదు. ఈ పరిస్థితుల్లో పాక్‌లోని అనేక రాష్ట్రాలు.. భారత్ తరహాలో దేశాన్ని లాక్ డౌన్ చేయాలనే యోచనలో ఉన్నాయి. ఈ యోచనను పాక్‌ మీడియా కూడా సమర్థిస్తోంది.

ఇదే అంశంలో పాక్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఇమ్రాన్‌ఖాన్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న అవ‌గాహ‌నా రాహిత్యాన్నిమ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లు చేశాయి. భార‌త్‌లో లాక్‌డౌన్ విష‌యంలో మోదీ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పార‌ని, లాక్‌డౌన్ విధిస్తే ఎంత‌టి త‌ప్పు నిర్ణ‌య‌మో త‌న‌కు తెలుసున‌ని ఇమ్రాన్ మాట్లాడారు. అయితే ఇమ్రాన్ వ్యాఖ్య‌ల‌ను ఆ దేశ మీడియానే త‌ప్పుబట్టింది. భారత ప్రధాని మాట్లాడింది పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడ‌టం స‌రికాద‌ని తెలిపింది. మోదీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారా అంటూ ఇమ్రాన్ ఖాన్‌పై దుమ్మెత్తిపోసింది. లాక్ డౌన్ చేసినందుకు మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పలేదని..దీని వల్ల వారు ఇబ్బందులు పడుతున్నందుకు మాత్రమే క్షమాపణలు చెప్పారని ఆధారాలతో సహా చూపించింది. మోదీ వ్యాఖ్య‌ల‌ను పూర్తిగా అర్థం తెలుసుకుని మాట్లాడితే బాగుండేద‌ని హిత‌వు ప‌లికింది.



logo