మంగళవారం 19 జనవరి 2021
International - Jan 10, 2021 , 22:37:36

ట్రంప్ ఎఫెక్ట్‌: ఆపిల్‌ యాప్‌స్టోర్‌ నుంచి పార్లర్ ఔట్‌

ట్రంప్ ఎఫెక్ట్‌: ఆపిల్‌ యాప్‌స్టోర్‌ నుంచి పార్లర్ ఔట్‌

వాషింగ్ట‌న్‌: అమెరికా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌ పార్లర్‌పై టెక్ దిగ్గ‌జం ఆపిల్ యాజ‌మాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తమ యాప్‌ స్టోర్‌ నుంచి పార్లర్‌ను తొలగించింది. క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడికి ట్రంప్ మ‌ద్ద‌తుదారులు పార్లర్‌ యాప్‌ను ఉపయోగించుకున్నారని ఆపిల్‌ ఆరోప‌ణ‌. 24 గంటల్లోపు ఆ సంస్థ యాప్‌లో మార్పులు చేర్పులపై ప్రణాళికతో తమ వద్దకు రావాలని ఆపిల్‌ సూచించిన  తర్వాత ఈ చర్యలు తీసుకొంది. 

ఇప్పటికే పార్లర్‌ కూడా త‌మ యాప్‌లో మార్పులకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, వీటికి కొంత సమయం కోరింద‌ని, ఈ లోపు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తానని తెలిపింది. పార్ల‌ర్ యాప్ చేసిన ఈ ప్రతిపాదనలను ఆపిల్‌ తిరస్కరించింది.  ఇప్పటికే హింసను రెచ్చగొట్టే బెదిరింపులు.. చట్ట వ్యతిరేక చర్యలకు పిలుపునివ్వడం వంటివి ఈ యాప్‌లో కనిపిస్తున్నట్లు ఆపిల్‌ శనివారం పేర్కొంది. 

దీంతో త‌మ‌‌ యాప్‌ స్టోర్‌ నుంచి పార్లర్‌ను తొలగించిన‌ట్లు ఆపిల్ తెలిపింది. త‌మ వినియోగ‌దారుల భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ‌కు అనుగుణంగా త‌మ యాప్ స్టోర్‌లోని యాప్‌లు ఉండాల‌ని ఆపిల్ పేర్కొంది. దీంతో  ఐఫోన్‌, ఐపాడ్‌ ఇతర ఆపిల్‌ పరికరాల్లో పార్లర్‌ యాప్‌కనిపించదు. ఆ యాప్‌ ప్రమాదకరమైన కంటెంట్‌ను తొలగించేలా ఫిల్టర్లు ఏర్పాటు చేసినట్లు పార్ల‌ర్ నిరూపించుకోవాలి.

దీంతోపాటు శుక్రవారం సెర్చింజ‌న్ గూగుల్‌ కూడా తన ప్లేస్టోర్‌ నుంచి పార్లర్‌ను తొలగించింది. పార్ల‌ర్ యాప్ హింస‌ను ప్రోత్స‌హించేలా ఉంద‌ని గూగుల్ పేర్కొంది. మరోపక్క అమెజాన్‌ కూడా తన అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ యూనిట్‌ నుంచి పార్లర్‌ను సస్పెండ్‌ చేసింది. ట్విట్ట‌ర్ శాశ్వ‌తంగా డొనాల్డ్ ట్రంప్‌ను నిషేధించిన సంగ‌తి తెలిసిందే. ఫేస్‌బుక్‌, స్నాప్ చాట్ కూడా అదేబాట‌లో ప‌య‌నించాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.