గురువారం 22 అక్టోబర్ 2020
International - Oct 04, 2020 , 16:37:30

రహస్య విషయాలుగా అమెరికా అధ్యక్షుల ఆరోగ్యం!

రహస్య విషయాలుగా అమెరికా అధ్యక్షుల ఆరోగ్యం!

వాషింగ్టన్‌ : అమెరికా చరిత్రలో అసౌకర్యమైన నిజం ఒకటి బయటపడింది. అమెరికా అధ్యక్షుల ఆరోగ్యం  గురించి అక్కడి ప్రభుత్వం ప్రపంచానికి అబద్దాలను ప్రచారం చేస్తున్న విషయం ఇన్నాళ్లూ గుట్టుగా ఉండేది. అయితే కరోనా వైరస్‌ మహమ్మారికి గురైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ చికిత్స పొందుతున్న తీరును గమనిస్తే అమెరికా ఆడుతున్న అబద్దాలు నిజమే అని అనుకోని వారు ఉండరు. కొవిడ్‌-19కు గురైన ట్రంప్‌కు "తేలికపాటి లక్షణాలు" ఉన్నాయని తొలుత ప్రకటించిన వైట్‌హౌస్ అధికారులు‌.. శుక్రవారం సాయంత్రం నాటికి అతడిని  వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో చేర్పించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోగ్యంపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇది డొనాల్డ్ ట్రంప్, అతని కొవిడ్‌-19 నిర్ధారణకు సంబంధించిన ఒక దృష్టాంతంగా అనిపించవచ్చు. కానీ, వాస్తవానికి అమెరికా గత అధ్యక్షుల ఆరోగ్య విశేషాలను పరిశీలిస్తే అధ్యక్షుల ఆరోగ్యం రహస్యాలను అమెరికా దాచిపెడుతున్నట్లుగా తెలుస్తున్నది. కొన్ని సందర్భాల్లో సమస్యలు చిన్నవి.. ఇతర సందర్భాల్లో చాలా తీవ్రమైనవి. కొన్నిసార్లు ప్రజలు సత్యాన్ని తెలుసుకోవడానికి దశాబ్దాల సమయం పట్టింది. 1919 లో అప్పటి అధ్యక్షుడు వుడ్రో విల్సన్‌పై విషప్రయోగం  జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ, నిజానికి అయన "స్పానిష్ ఫ్లూ"కు గురై తీవ్ర అనారోగ్యం పాలైన విషయం చాలా ఏండ్ల తర్వాత బయటపడింది. సరిగ్గా వందేండ్ల తర్వాత ఇలాంటి సందర్భమే మరొకటి మనముందు సాక్షాత్కారించింది. 

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కొవిడ్ -19 కు గురైన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే అతడిని మిలటరీ దవాఖానకు తరలించి చికిత్స అందించడం ప్రారంభించారు. వైట్ హౌస్ చీఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మరో 48 గంటలు అతని సంరక్షణ పరంగా కీలకమన్నారు. నిజంగానే ట్రంప్‌కు కరోనా వైరస్‌ తేలికపాటి లక్షణాలు ఉన్నాయా? ఆయన ఆరోగ్యం దృష్ట్యా వైద్యులు తీవ్రంగా పరిగణిస్తున్నారా? రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? అనేవి సగటు అమెరికన్లను తొలిచివేస్తున్న ప్రశ్నలు. గతంలో కూడా అధ్యక్షుల ఆరోగ్యం విషయంలో అధికారులు అసత్యాలను వెల్లడించినట్లు తెలుస్తున్నది. భయాందోళనలు సృష్టించకుండా ఉండటానికి మహమ్మారిని ట్రంప్ వైద్యులు తగ్గించినట్లు పలువురు భావిస్తున్నారు. 

భయంతో దాపరికాలా?

ఆరోగ్యం సరిగా లేకపోవడం రాజకీయ బలహీనత అవుతుందనే భయంతో అమెరికాకు 22, 24వ అధ్యక్షుడిగా ఉన్న గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్.. లాంగ్ ఐలాండ్ సౌండ్‌లోని ఒక ప్రైవేట్ పడవలో అర్థరాత్రి రహస్యంగా నోటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అతని నోటి నుండి తీసిన క్యాన్సర్ గాయాన్ని 2000 లో ఫిలడెల్ఫియాకు చెందిన వైద్య సమాజం కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ప్రదర్శనలో ప్రదర్శించారు. అలాగే, అమెరికా 36 వ అధ్యక్షుడు లిండన్ బీ జాన్సన్ 1967 లో తన చేతి చర్మ గాయాన్ని తొలగించడానికి రహస్యంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ చాలా రహస్యంగా ఉంచింది.

విల్సన్‌పై విషప్రయోగమా? మహమ్మారి కారణమా?

వుడ్రో విల్సన్, డొనాల్డ్‌ ట్రంప్.. ఇద్దరి అధ్యక్ష పదవులను మహమ్మారులు శపించినట్లుగా కనిపిస్తున్నది. పెద్ద సంఖ్యలో అమెరికన్లను బలిగొన్న మహమ్మారులకు ఈ ఇద్దరు అధ్యక్షులు కూడా గురైనారు. వుడ్రో విల్సన్ అరోగ్య సమస్యను కూడా వైట్‌హైస్‌ రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించింది. వుడ్రో విల్సన్ 1919 ఏప్రిల్‌లో అనారోగ్యానికి గురైనప్పుడు మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించడంపై పారిస్‌లో చర్చలు జరుపుతున్నారు. అతనికి స్పానిష్‌ ఫ్లూ లక్షణాలు చాలా తీవ్రంగా ఉండి అకస్మాత్తుగా బయటపడ్డాయి. విల్సన్‌ వ్యక్తిగత వైద్యుడు కారీ గ్రేసన్.. అతను విషం తీసుకున్నట్లుగా భావించి ఈ విషయాన్ని వైట్‌హౌస్‌కు లేఖ ద్వారా తెలియజేశాడు. ఆ తరువాత విల్సన్ స్ట్రోక్‌కు కూడా గురయ్యారు. అయినప్పటికీ 1921 లో అతని పదవీకాలం ముగిసే వరకు అధ్యక్షుడిగా కొనసాగారు. థులానే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ జాన్‌ బారీ తన పుస్తకం ది గ్రేట్‌ ఇన్‌ఫ్లూయెంజాలో రాసిన విషయాలను బట్టి అర్థమవుతున్నది.

పోలియోను దాచిన ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్

ఫ్రాంక్లిన్ డీ రూజ్‌వెల్ట్ పోలియోతో బాధపడ్డాడని, అతను వీల్ చైర్, క్రచెస్ వాడకాన్ని దాచడానికి చాలా బాధపడ్డాడని అందరికీ తెలుసు. అంతగా తెలియని విషయం ఏమిటంటే.. 1944 జూలైలో రూజ్‌వెల్ట్ నాలుగోసారి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నప్పుడు.. ఎన్నికలు ముగిసి మరోసారి అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని ఒక వైద్యుడు రహస్య మెమోలో ప్రకటించారు. రూజ్‌వెల్ట్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లయితే.. ఆయన పదవీకాలం పూర్తిచేసే శారీరక సామర్థ్యం ఉందని నేను నమ్మలేదని డాక్టర్ ఫ్రాంక్ లాహే ఒక లేఖలో వెల్లడించారు. 1944లోనే రూజ్‌వెల్ట్‌ అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. వైట్‌హౌస్‌ మాత్రం రహస్యంగానే ఉంచినట్లు తెలుస్తున్నది. 

ఎనిమిది రకాల మందులు వాడే కెన్నెడీ

చరిత్రకారుడు రాబర్ట్ డాలెక్ ప్రకారం.. అమెరికాకు 35 వ అధ్యక్షుడిగా ఉన్న జాన్ ఎఫ్ కెన్నెడీ చాలా మందికి తెలిసిన దానికంటే ఎక్కువ నొప్పిని, అరోగ్య సమస్యలతో బాధపడ్డారు. రోజుకు ఎనిమిది రకాల మందులు తీసుకునేవారు. వాటిలో నొప్పి నివారణ మందులు, ఉద్దీపన మందులు, స్లీపింగ్ మాత్రలు, హార్మోన్లు కూడా ఉన్నాయి. కెన్నెడీ జీవిత చరిత్ర రాసిన డాల్లెక్.. కెన్నెడీ హత్యకు ముందు కెన్నెడీ జీవితంలో గత ఎనిమిదేండ్ల నుంచి వైద్యానికి సంబంధించిన ఫైళ్ళను పరిశీలించడం విశేషం. ప్రమాదకరమైన అడిసర్‌ వ్యాధితోపాటు జీర్ణసంబంధ సమస్యలను కెన్నెడీ ఎదుర్కొన్నారని రచయిత రాబర్ట్‌ డాల్లెక్‌ వెల్లడించారు. తాను ఎదుర్కొంటున్న వ్యాధులను దాచిపెట్టి ఉంచేందుకు కెన్నెడీతోపాటు ఆయన వ్యక్తిగత వైద్యులు గోప్యత పాటించినట్లుగా తెలుస్తున్నది. మీడియా ప్రతినిధులు అడిగినా ఏనాడూ కెన్నెడీ నోరు జారలేదు.

ఐసెన్‌హోవర్‌కు గుండె సమస్యలు

అమెరికాకు 34వ అధ్యక్షుడిగా ఉన్న డ్వైట్ ఐసెన్‌హోవర్‌ కూడా గుండె సంబంధ సమస్యలతో బాధపడినట్లుగా  తెలుస్తున్నది. 1955 లో కొలరాడోలో విహారయాత్రలో ఉన్న సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అతను ఆరు వారాలపాటు దవాఖానలో ఉండి చికిత్స తీసుకున్నారు. అధ్యక్ష పదవికి రెండోసారి పోటీ చేయవద్దని ఐసన్‌హోవర్‌కు సలహా ఇవ్వడానికి బదులుగా.. గుండె కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని అతని వ్యక్తిగత వైద్యుడు సిఫారసు చేయడం గమనార్హం.

హారిసన్‌కు న్యుమోనియా

అమెరికా 33వ అధ్యక్షుడిగా ఉన్న విలియం హెన్రీ హారిసన్ తన తొలినాళ్లలో చల్లని వాతావరణంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని అని వైద్యులు భావించగా.. ఆయన న్యుమోనియాకు గురయ్యారు. అక్కడ అతను గుర్రపు సాన్స్ టాప్‌కోట్‌లో ప్రయాణించాడు. హారిసన్ అనారోగ్యంతో ఉన్నారని వైట్ హౌస్ ప్రజలకు చెప్పలేదు. ప్రమాణ స్వీకారం చేసిన నెలరోజులకే.. అనారోగ్యానికి గురైన తొమ్మిది రోజునే హారిసన్ కన్నుమూశారు.

కాల్పులు జరిపినా రీగన్‌ నడుస్తూ వెళ్లాడంటా!

అమెరికాకు 40 వ అధ్యక్షుడిగా ఉన్న రోనాల్డ్‌ రీగన్‌పై 1981 మార్చి 30న హత్యాయత్నం జరిగింది. రీగన్‌ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను వైట్‌హౌస్‌ ప్రతినిధి డేవిడ్‌ గార్గెన్‌ మీడియాకు వెల్లడిస్తూ.. కాల్పులు జరిగిన తర్వాత అధ్యక్షుడు స్వయంగా నడుస్తూ దవాఖానకు వెళ్లాడని చెప్పారు. ఆయన సలహాదారు లిన్‌ నోఫ్టిగర్‌ మాట్లాడుతూ.. రీగన్‌ స్పృహలోనే ఉన్నారని, బుష్‌తో కలిసి సందర్శించినప్పుడు ఆయన బుగ్గలు గులాబీ మొగ్గల్లా ఉన్నాయని, దృఢంగా ఉన్నాడని చెప్పారు. ప్రజలకు చెప్పని విషయం ఏమిటంటే.. రీగన్ దవాఖాన లోపల సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల చేతుల్లో కుప్పకూలిపోయాడు. అతడిని పరీక్షించిన వైద్యులు, నర్సులు అతను చనిపోయాడని నమ్ముతారు.

మానవ మాత్రులమైన మనకు ఆరోగ్య సమస్యలు రావడం సర్వసాధారణమే అయినప్పటికీ.. అమెరికా తమ అధ్యక్షుల ఆరోగ్యం విషయంలో మాత్రం దాపరికం పాటిస్తూనే ఉన్నది. అధ్యక్షుల ఆరోగ్యం గురించి ప్రజలకు తెలియజేయకుండా వైట్‌హౌస్‌ గోప్యత పాటిస్తూ వస్తున్నదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.


logo