గురువారం 04 జూన్ 2020
International - May 21, 2020 , 11:51:02

కరోనా: బామ్మను కావలించుకోవడం ఎలా?

కరోనా: బామ్మను కావలించుకోవడం ఎలా?

న్యూఢిల్లీ: అసలే కరోనా.. భౌతిక దూరం తప్పనిసరి. పెద్దవాళ్లను కాపాడడం మరీ ముఖ్యం. ఎందుకంటే కరోనా వారికి ప్రాణాంతకం అవుతుంది. కానీ ఆంటోనీ కావిన్‌కు తన బామ్మను హత్తుకోవాలని ఉంది. శతకోటి కష్టాలకు అనంతకోటి ఉపాయాలు ఉండనే ఉంటాయి. కొంచెం బుర్ర ఉపయోగిస్తే సరి. కావిన్ ఆ పనే చేశాడు. తరుణోపాయం కనిపెట్టేశాడు. కరోనా జేజెమ్మ వచ్చినా ఏమీ చేయలేదు. అలాంటి కర్ెటన్ తయారు చేశాడు. నిలువెత్తు ప్లాస్టిక్ కర్టెన్‌కు చేతులకు వేసుకునే పొడవాటి గ్లౌజ్ తగిలించాడు. ఇంకేముంది తిన్నగా వెళ్లి తనకు ఎంతో ప్రియమైన బామ్మను గాట్టిగా వాటేసుకున్నాడు. ఈ వీడియో కావిన్, అతని భార్య మిరియం ముందుగా ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. కడిల్ కర్టెన్ అని పిలిచే ఈ తెరకు అటూఇటూ నిల్చుని బామ్మ, మనుమడు కావలించుకోవడం నెట్‌లో వైరల్ అయింది. 56 లక్షల మంది ఈ వీడియోను చూశారు. చాలామంది ఈ వీడియోను చూసి కళ్లు వత్తుకున్నట్టు కామెంట్లు పెట్టారు. నాకూ మా తాతను కడిల్ కర్టెన్‌తో కావలించుకోవాలని ఉంది అని ఓ వ్యక్తి రాశాడు. కొత్త ఐడియాలను మనసారా ఆహ్వానించి అభినందించే తత్వమున్న పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఈ వీడియోను షేర్ చేశారు.


logo