శనివారం 30 మే 2020
International - Apr 30, 2020 , 02:06:29

ముంచుకొస్తున్న ‘జూన్‌' గడువు

ముంచుకొస్తున్న ‘జూన్‌' గడువు

  • 2 లక్షల మంది హెచ్‌1బీ వీసాదారులపై వేలాడుతున్న కత్తి
  • జూన్‌తో  ముగియనున్న హెచ్‌1బీ  గడువు
  • అమెరికాలో ఉండలేక.. స్వస్థలాలకు వెళ్లే మార్గం లేక నరకయాతన 
  • అక్కడ ఉండలేక, స్వస్థలాలకు వచ్చే మార్గం లేక నరకయాతన 

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 29: డాలర్‌డ్రీమ్స్‌ చెదురుతున్నాయి. అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగుల భవిష్యత్‌ కలలపై కరోనా నీళ్లు చల్లింది. జూన్‌ చివరినాటికి దాదాపు 2 లక్షల మంది హెచ్‌1బీ వీసాదారులు చట్టబద్ధంగా ఆ దేశంలో నివసించే హక్కును కోల్పోనున్నారు. ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో అక్కడ ఉండే పరిస్థితులు లేక, స్వస్థలాలకు వెళ్లే మార్గం లేక వారు నరకయాతన అనుభవిస్తున్నారు. హెచ్‌1బీ వీసాపై పనిచేస్తున్నవారిలో భారతీయులే అత్యధికం. దీంతో మనవారిపై ఈ ప్రభావం భారీగానే పడనుంది.

అమెరికాలో చట్టబద్ధంగా నివసించడానికి రమ్యకు ఇక మూడు వారాలే గడువు మిగిలుంది! గత రెండేండ్లుగా న్యూజెర్సీలో ఆమె పనిచేస్తున్న దంత వైద్యశాల కరోనా కారణంగా మార్చి మధ్యలో మూతపడింది. అప్పటినుం చి రమ్యకు వేతనం లేదు. హెచ్‌1బీ వీసాపై ఆమె అమెరికాలో పనిచేస్తున్నారు. హెచ్‌1బీ వీసాదారులు వేతనం లేకుండా కేవలం 60 రోజులు మాత్రమే అక్కడ చట్టబద్ధంగా నివసించేందుకు హక్కు ఉంటుంది. రమ్య భర్త కూడా డెంటిస్ట్‌. ఆయన వీసా గడువు కూడా ఈ జూన్‌తో ముగియబోతున్నది. ఈ నేపథ్యంలో అటు అమెరికాలో ఉండలేక, ఇటు భారత్‌కు వచ్చే దారిలేక వారు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. కరోనా కారణంగా విదేశీ రాకపోకలను భారత్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. అమెరికా విశ్వవిద్యాలయాల్లో అడ్వాన్డ్స్‌ డెంటల్‌ కోర్సులు పూర్తిచేసేందుకు ఆ దంపతులిద్దరూ సుమారు 520000 డాలర్ల రుణం తీసుకున్నారు. ఇప్పుడు దాన్ని ఎలా చెల్లించాలో తెలియక సతమతం అవుతున్నారు.  ఇది కేవలం ఒక్క రమ్య పరిస్థితి మాత్రమే కాదు. అనేక మంది హెచ్‌1బీ వీసాదారులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. 

వారంతా ఇంటికేనా..

సుమారు 2,50,000 మంది ఉద్యోగులు అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో దాదాపు 2 లక్షల మంది హెచ్‌1బీ వీసాదారులకు ఈ జూన్‌తో గడువు ముగియబోతున్నదని ఇమ్మిగ్రేషన్‌ అనలిస్ట్‌ జెరెమీ న్యూఫెల్డ్‌ వెల్లడించారు. నివాస హోదా కోరని మరో వేలాది మంది కూడా స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.  

60 రోజులే గడువు..

గత 2 నెలల్లో అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే స్థానికులతో పోలిస్తే విదేశీ ఉద్యోగులు మరింత సంకట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు, కంపెనీలు వారిని వేతనం లేని సెలవుపై పంపడం, వేతనాన్ని తగ్గించడం లేదా వర్క్‌ ఫ్రం హోమ్‌కు అనుమతించడం వంటివి వీసా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయి. ఈ విధంగానూ వారికి వీసా ముప్పు ఉంది. ఉద్యోగం కోల్పోయిన హెచ్‌1బీ వీసాదారులు 60 రోజుల్లో మరో ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వేరే వీసాకు మారడం లేదా దేశాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. 

గడువు పొడిగింపుపై స్పందించని సర్కార్‌..

టెక్‌నెట్‌ అనే లాబీయింగ్‌ గ్రూప్‌ ఈ నెల 17న అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగానికి లేఖ రాసింది.  వీసా గడువు పూర్తయిన వారికి సెప్టెంబర్‌ 10 వరకు సమయమివ్వాలని కోరింది. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని పేర్కొంది. అయితే ప్రభుత్వం ఆ లేఖపై స్పందించలేదు. 


logo