శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 27, 2020 , 14:32:14

ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా ఆపిల్ రికార్డు...!

ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా ఆపిల్ రికార్డు...!

వాషింగ్ టన్ : ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి కొన్ని సంస్థలకు కలిసి వస్తున్నది. ఆపిల్ ఇంక్ 2.13 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో రికార్డు సృష్టించి ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. సెర్చింజన్ గూగుల్(1.09 ట్రిలియన్ డాలర్లు), సోషల్ మీడియా దిగ్గజం(800 బిలియన్ డాలర్స్) రెండింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఎక్కువగా ఉంది. ఆపిల్ ఆగస్ట్ 19న 2 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. ఈ రికార్డుకు చేరుకున్న తొలి అమెరికా కంపెనీ ఇదే. ఏప్రిల్-జూన్ 2020 క్వార్టర్‌లో భారీ లాభాలను నమోదు చేసింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐఫోన్ సేల్స్ పడిపోయాయి. కానీ ఆపిల్ టీవీ, ఆపిల్ మ్యూజిక్, కొత్త ఐఫోన్ ఎస్ఈ భారీ లాభాలను తెచ్చి పెట్టింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ కంపెనీల్లో ఆపిల్ 2.135 ట్రిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది అమెరికా కంపెనీ. ఆ తర్వాత సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్‌కో(2.049 ట్రిలియన్ డాలర్లు) ఉంది. అమెజాన్(1.676 ట్రిలియన్ డాలర్లు), మైక్రోసాఫ్ట్(1.638 ట్రిలియన్ డాలర్లు), అల్పాబెట్(గూగుల్-1.093 ట్రిలియన్ డాలర్లు), ఫేస్‌బుక్(800 బిలియన్ డాలర్లు)తో అమెరికాకు చెందిన ఈ కంపెనీలు వరుసగా 3వ, 4వ, 5వ, 6వ స్థానంలో ఉన్నాయి.

చైనాకు చెందిన అలీబాబా(764.82 బిలియన్ డాలర్లు), టెన్సెంట్(689.22 బిలియన్ డాలర్లు) వరుసగా 7, 8 స్థానాల్లో ఉన్నాయి. అమెరికాకు చెందిన కంపెనీలు బెర్క్‌షైర్ హాత్‌వే(509.54 బిలియన్ డాలర్లు), వీసా(456.87 బిలియన్ డాలర్లు), జాన్సన్ అండ్ జాన్సన్(400.34 బిలియన్ డాలర్లు) వరుసగా 9, 10, 11వ స్థానాల్లో ఉండగా, 12వ స్థానంలో తైవాన్‌కు చెందిన టీఎస్ఎంసీ 383.58 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిఉంది. ఆపిల్ ఇంక్ 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజషన్‌తో రికార్డ్ సృష్టించింది.

అమెరికా జీడీపీలో ఆపిల్ ఇంక్ దాదాపు 10 శాతంగా ఉంటుంది. భారత జీడీపీతో చూస్తే నాలుగింట మూడింతలు ఉంటుంది. 0 నుంచి 1 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగడానికి ఆపిల్‌కు 42 ఏండ్లు పట్టింది. అయితే 1 ట్రిలియన్ డాలర్ల నుంచి 2 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి కేవలం రెండేళ్లు మాత్రమే తీసుకుంది. దాదాపు జూలై 31వ తేదీ నుంచి ఆపిల్ మోస్ట్ వ్యాల్యుబుల్ కంపెనీగా ఉంది. ఆపిల్ స్టార్ ప్రోడక్ట్ ఐఫోన్ వాటా 50 శాతంగా ఉంటుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo