బుధవారం 03 జూన్ 2020
International - Mar 28, 2020 , 16:10:35

కరోనా సాయం.. చైనా నుంచి జర్మనీకి బయలుదేరిన రైలు

కరోనా సాయం.. చైనా నుంచి జర్మనీకి బయలుదేరిన రైలు

వూహాన్ (చైనా): కరోనా వైరస్  నుంచి కోలుకుంటున్న   చైనాలోని వూహాన్ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.  హుబే ప్రావిన్సులోని వూహాన్ నగరంతో పాటు ఆయా ప్రాంతాల్లో  రవాణా, ప్రయాణికుల సర్వీసులు ప్రారంభమయ్యాయి.  కరోనా వైరస్ ఉద్భవించిన తర్వాత వూహాన్ నగరాన్ని  చైనా ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేసిన విషయం తెలిసిందే.  కరోనా వైరస్‌ కారణంగా యూరప్‌ దేశాలు గజగజా వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఇటలీ, స్పెయిన్‌, జర్మనీ, యూకే దేశాలు వైరస్‌ దెబ్బకు అతలాకుతలం అయిపోతున్నాయి. రోగులకు వైద్య సదుపాయాలు, మందులు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. 

కరోనాను కట్టడి చేయడంలో విజయం సాధించిన చైనా ఇప్పుడు కరోనా ప్రభావిత దేశాలకు సాయం చేస్తోంది.  దీనిలో భాగంగానే కోవిడ్‌-19  చికిత్సకు అవసరమైన 166.4 టన్నుల మందులను సాయంగా అందిస్తోంది.  మందులతో ఉన్న  సరకు రవాణా రైలు శనివారం వుహాన్‌ నుంచి జర్మనీలోని డూయిస్‌బర్గ్‌కు బయలుదేరింది.  ఈ ప్రత్యేక రైలు 15 రోజుల తర్వాత జర్మనీ చేరుకోనుంది. రైలులోని కరోనా వైరస్‌ను నియంత్రించే  మందులను యూరప్‌ దేశాలకు పంపిణీ చేయనున్నారు. రైలు సర్వీసులను పునరుద్దరించిన తర్వాత యూరప్‌ వెళ్తున్న తొలి చైనా-యూరో రవాణా రైలు ఇదే. logo