బుధవారం 03 జూన్ 2020
International - Apr 13, 2020 , 01:36:52

జర్మనీ.. దిక్సూచి!

జర్మనీ.. దిక్సూచి!

  • ప్రభుత్వం పటిష్ఠ చర్యలు 
  • కరోనాకు ముకుతాడు
  • మరణాల రేటు 2 శాతమే
  • వైరస్‌ కట్టడిలో ఇతర దేశాలకు మార్గదర్శకం

బెర్లిన్‌: కరోనా మహమ్మారి ఐరోపా దేశాలను అతలాకుతులం చేస్తున్నది. ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి దేశాల్లో మరణమృదంగం మోగిస్తున్నది. అయితే మిగిలిన ఐరోపా దేశాలతో పోలిస్తే జర్మనీ కరోనాను సమర్థంగా నిలువరిస్తున్నది. ఇటలీ, బ్రిటన్‌లలో మరణాల రేటు 12 శాతం ఉండగా, జర్మనీలో కేవలం రెండు శాతం మాత్రమే ఉండడం విశేషం. దీంతో కరోనా కట్టడికి జర్మనీ అనుసరించిన విధానం మిగిలిన దేశాలకు దిక్సూచిగా మారింది. 

వారానికి 5 లక్షల మందికి పరీక్షలు

తక్కిన యూరప్‌ దేశాలతో పోలిస్తే జర్మనీ అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించింది. తద్వారా వేగవంతంగా బాధితులను గుర్తించి, వారిని ఐసొలేట్‌ చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసింది. వారానికి దాదాపు 5 లక్షల మందికిపైగా పరీక్షలు నిర్వహించగల సామర్థ్యం జర్మనీ సొంతం. 

బాధితుల్లో వృద్ధులు 20 శాతమే..

వృద్ధులకు కరోనా ప్రా ణాంతకం అన్న విషయం తెలిసిందే. జర్మనీలో కరోనా బాధితుల్లో 60 ఏండ్లు పైబడిన వారు కేవలం 20 శాతం మందే ఉన్నారు. అదే ఇటలీ, స్పెయిన్‌ వంటి ఇతర ఐరోపా దేశాల్లో ఈ వయసు వారు దాదాపు 50 శాతానికి పైగా ఉన్నారు. జర్మనీ జనాభా సగటు వయసు 45.7 ఏండ్లు కాగా, 65 ఏండ్లు పైబడిన వారు 21 శాతం ఉన్నారు. ఇటలీ జనాభా సగటు వయసు 47.3 ఏండ్లు కాగా, 65 ఏండ్లు పైబడిన వారు 23 శాతం ఉన్నారు. ఇక బ్రిటన్‌ జనాభా సగటు వయసు 40.5 ఏండ్లు కాగా, 65 ఏండ్లు పైబడిన వారు 19 శాతం ఉన్నారు. జర్మనీలోనూ వృద్ధుల జనాభా అధికంగా ఉన్నప్పటికీ విస్తృత పరీక్షలు, ఐసొలేషన్‌, నిర్ణీత దూరం పాటించడం వంటి చర్యల ద్వారా ఆ దేశం ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగింది. 

హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌..

గత కొన్నేండ్లుగా వైద్య రంగంలో నిలకడగా పెట్టుబడులు పెట్టడం జర్మనీకి లాభించింది. ఆ ప్రతిఫలాలు ఇప్పుడు అందివస్తున్నాయి. జర్మనీలో ప్రతి లక్షమందికి 34 వెంటిలేటర్లు ఉన్నాయి. అదే ఇటలీలో కేవలం ఏడు మాత్రమే ఉన్నాయి. ఇక అక్యూట్‌ కేర్‌ బెడ్‌ల విషయానికి వస్తే, జర్మనీలో ప్రతి లక్షమందికి 621 బెడ్‌లు ఉన్నాయి. ఇటలీ, బ్రిటన్‌తో పోలిస్తే ఇది రెట్టిం పు కంటే అధికం. ఇటలీలో లక్ష మందికి 275 బెడ్‌లు, బ్రిటన్‌లో 228 బెడ్‌లు మాత్రమే ఉన్నాయి.


logo