గురువారం 28 మే 2020
International - Apr 26, 2020 , 02:16:48

బ్రెజిల్‌ ఆగమాగం!

బ్రెజిల్‌  ఆగమాగం!

  • ప్రధాన నగరాల్లో కరోనా కల్లోలం
  • అరకొర పరీక్షలు.. ప్రభుత్వం అలసత్వం
  • గుట్టలుగా మృతదేహాలు.. సామూహిక ఖననాలు
  • చేతులెత్తేస్తున్న దవాఖానలు

రియోడి జెనీరో: లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌లో కరోనా విలయం సృష్టిస్తున్నది. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రభుత్వం అలసత్వం, వైరస్‌ సృష్టించబోయే విధ్వంసాన్ని అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో తేలిగ్గా తీసుకోవడం, రోగులను గుర్తించేందుకు పెద్దయెత్తున నిర్ధారణ పరీక్షలు నిర్వహించకపోవడం, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు సరిపోకపోవడం.. వెరసి బ్రెజిల్‌ను మృత్యు కుహరంగా మార్చేస్తున్నది. కొత్త కేసుల్ని చేర్చుకునేందుకు అవకాశమేలేదని దేశవ్యాప్తంగా పలు దవాఖానలు చేతులెత్తేశాయి. ఇబ్బడిముబ్బడిగా వస్తున్న మృతదేహాలతో శవాగారాలు, శ్మశాన వాటికలు నిండిపోతున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రియోడిజెనీరో నగరంతో పాటు మరో నాలుగు ప్రధాన నగరాల్లో ఇప్పటికే అన్ని దవాఖానలు కొవిడ్‌-19 రోగులతో నిండిపోయాయి. దేశంలో కరోనా కేసులు 53 వేలకు చేరుకోగా, మృతుల సంఖ్య 3600ను దాటిందని ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 3700 కొత్త కేసులు నమోదుకాగా, 400 మంది మరణించారని అధికారులు తెలిపారు. 

అలా చేస్తే అడ్డుకట్ట పడుతుందా?

బ్రెజిల్‌లో కరోనా ఉద్ధృతి అంతకంతకూ తీవ్రతరం అవుతున్నప్పటికీ అధ్యక్షుడు బోల్సోనారో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తున్నది. కొవిడ్‌-19 చిన్న వ్యాధి అని ఆయన పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. వైరస్‌ను ఎదుర్కోవడానికి నిర్ణీత దూరం పాటించాల్సిన అవసరం లేదని, బ్రెజిలియన్లలో అధిక ప్రమాదం ఉన్న వారిని మాత్రమే ఐసొలేట్‌ చేయాలని ఆయన సూచించారు. మరోవైపు, దేశంలో తగిన స్థాయిలో వైరస్‌ పరీక్షలు జరుగడంలేదని నిపుణులు ఆరోపిస్తున్నారు. నిర్ధారణ పరీక్షలు తక్కువగా నిర్వహిస్తుండటంతో వైరస్‌ సోకిన వారిని గుర్తించడంలో విఫలమవుతున్నామని, దీన్నిబట్టి కేసుల సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకూ దేశంలో దాదాపు 5,87,000 నుంచి 11 లక్షల మందికి కరోనా సోకి ఉండొచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రసీలియా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు నమోదవుతున్న మరణాలన్నీ గడిచిన రెండు వారాల కేసులకు సంబంధించినవేనని సావో పాలో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఒకరు చెప్పారు. 

రోజుకు 100 శవాల్ని.. 

రాజధాని రియోడి జెనీరోతో పాటు మరో నాలుగు ప్రధాన నగరాల్లో ఇప్పటికే అన్ని దవాఖానలు కరోనా రోగులతో నిండిపోయాయి. కొత్త కేసుల్ని చేర్చుకోలేమని రియో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన వర్గాలు ప్రకటనలు కూడా చేశాయి. కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జి కావడం లేదా మరణించడం రెండింట్లో ఏదో ఒకటి జరిగితేనే కొత్త పేషెంట్లను చేర్చుకోగలమని పేర్కొంటున్నారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మానాస్‌ నగరంలో ఒక శ్మశానవాటికలో కరోనా మృతుల కోసం పెద్దఎత్తున గోతులు తవ్వి సామూహిక ఖననాలు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. రోజూ వందకుపైగా మృతదేహాలను ఖననం చేస్తున్నట్టు  తెలిపారు. మానాస్‌లో శవాలను తరలించే ఓ డ్రైవర్‌ మాట్లాడుతూ.. ఇటీవల తాను నిర్విరామంగా 36 గంటలు పనిచేశానని చెప్పారు. అయినప్పటికీ, కొత్త మృతదేహాలు వస్తూనే ఉన్నాయని, దీంతో తన యజమాని తనతో పాటు మరో డ్రైవర్‌ను నియమించుకున్నారని వివరించారు.


logo