శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 23, 2020 , 22:16:32

వాళ్ళ అకౌంట్లలో పొరపాటున రూ.6,700 కోట్లు వేసిన బ్యాంకు.... వసూలు కోసం ఎన్ని తిప్పలో తెలుసా ?

వాళ్ళ అకౌంట్లలో పొరపాటున రూ.6,700 కోట్లు వేసిన బ్యాంకు....  వసూలు కోసం ఎన్ని తిప్పలో  తెలుసా ?

వాషింగ్ టన్: అమెరికాలోని మూడో అతిపెద్ద సిటీ బ్యాంకుతప్పులో కాలేసింది. ఇటీవల పొరపాటుగా సౌందర్య ఉత్పత్తుల దిగ్గజం రెవ్లాన్ కంపెనీకి చెందిన 900 మిలియన్ డాలర్లు(రూ.6700 కోట్లకుపైగా)ను ఆ కంపెనీ రుణదాతల అకౌంట్లలో వేసింది. క్లరికల్ లోపం కారణంగా ఈ పొరపాటు చోటు చేసుకుంది. పొరపాటున రెవ్లాన్ సంస్థ రుణదాతల అకౌంట్లలో పడిన మొత్తాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో భాగంగా శుక్రవారం మూడోసారి దావా వేసింది. సిటీ బ్యాంకు డజనుకు పైగా కంపెనీలపై దావా వేసింది. రెవ్లాన్ రుణదాతల అకౌంట్లలో పొరపాటున అమౌంట్ పడిన అనంతరం వాటిని తిరిగి పొందేందుకు సిటీ బ్యాంకు వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేసింది.

ఆ మొత్తం తిరిగి పంపించాలని కోరింది. దీంతో కొన్ని వందల మిలియన్ డాలర్ల కరెన్సీ తిరిగి వచ్చింది. దాదాపు నాలుగు వందల మిలియన్ డాలర్ల మేర తిరిగి వచ్చింది. మిగతా 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు ఆయా సంస్థలు నో చెబుతున్నాయి. దీంతో సీటీ బ్యాంకు దావా వేసేందుకు సిద్ధమైంది. ఆ మొత్తం సిటీ బ్యాంకుకు చెందినదని, అవి తిరిగి రావాలని ఆ బ్యాంకు చెబుతోంది. న్యాయం తమ వైపు ఉందని, కాబట్టి ఆ ఫండ్స్ తిరిగి వస్తాయని సిటీ బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల రెవ్లాన్ ఆర్థికంగా చితికిపోయింది. రుణదాతలకు దాదాపు 3 బిలియన్ డాలర్ల మేర బకాయిపడింది.

సమయానికి చెల్లించకపోవడంతో రుణదాతలు అసహనంతో ఉన్నాయి. టర్మ్ లోన్‌ను 2023 లోపు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెవ్లాన్‌పై కేసులు వేశాయి. ఈ కేసులో సిటీ బ్యాంకును ప్రతివాదిగా చేర్చాయి. ఈ పరిస్థితుల్లో 900 మిలియన్ డాలర్ల మొత్తాన్ని క్లరికల్ ఎర్రర్ కారణంగా రెవ్లాన్ ఖాతా నుండి రుణదాతల ఖాతాల్లోకి వెళ్లింది. అప్పటికే తమ బకాయిలు తిరిగి చెల్లించే అంశానికి సంబంధించి రుణదాత సంస్థలు అసహనంతో ఉన్నాయి. ఇప్పుడు తమ అకౌంట్లలో డబ్బులు పట్టాయి.

దీంతో అవి ఊరట పొందాయి. ఖాతాల్లోపడిన మొత్తాన్ని తిరిగిచ్చేందుకు రుణసంస్థలు నిరాకరిస్తున్నాయి. దాదాపు సగం వరకు వెనక్కి వచ్చింది. మిగతా సంస్థలు నో చెబుతున్నాయి. ఇది బిలియన్ డాలర్ల క్లరికల్ లోపమని ఫార్మర్ రీస్ట్రక్చరింగ్ అండ్ బ్యాంక్రప్టసీ అడ్వైజర్ మైఖేల్ స్టాంటోన్ అన్నారు. పొరపాటు చాలా దారుణమని, దాదాపు బిలియన్ డాలర్ల మేర అకౌంట్లలోకి వెళ్లడం ఈ శతాబ్దానికే అతిపెద్ద పొరపాటు అని చెబుతున్నారు.


logo