సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 31, 2020 , 19:22:22

లెబనాన్ నూతన ప్రధానిగా ముస్తఫా అదీబ్

లెబనాన్ నూతన ప్రధానిగా ముస్తఫా అదీబ్

బీరుట్ : లెబనాన్ దేశ ప్రధానిగా ముస్తఫా అదీబ్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన జర్మనీలో లెబనాన్ రాయబారిగా ఉన్నారు. ఈ నెల నాలుగో తేదీన బీరుట్లో జరిగిన పేలుడు నేపథ్యంలో ప్రధాని హసన్ డియాబ్ తన మొత్తం మంత్రివర్గంతో పాటు రాజీనామా చేశారు. స్థానిక వార్తా సంస్థ జిన్హువా ప్రకారం.. ముస్తఫా అదీబ్ 128 ఓట్లకు గాను 90 ఓట్లు సాధించగలగడంతో ప్రధాని పీఠాన్ని అధిష్టించనున్నారు.

ఆదివారం జరిగిన సమావేశంలో మాజీ ప్రధానులతో కలిసి అదీబ్ సమావేశమయ్యారు. అధ్యక్షుడు మిచెల్ ఆవున్ ను బాబ్డా ప్యాలెస్లో కలిసిన తరువాత అదిబ్.. ఇది దేశం కోసం పని చేయాల్సిన సమయమని, లెబనాన్‌లో మరోసారి అన్ని పార్టీలు కలిసి ఆశలు పెంచుకోవడానికి కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ప్రజలు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని, దేశం యొక్క వేగవంతమైన అభివృద్ధి కోసం వృత్తిపరమైన వ్యక్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు.

బీరుట్లో పేలుడు అనంతరం ప్రజలు ప్రధాని హసన్ డియాబ్‌కు వ్యతిరేకంగా చాలా రోజులు నిరసన తెలిపారు. దాంతో ఆయన ఆగస్టు 11 న మంత్రివర్గంతో పాటు రాజీనామా చేశారు. జనవరిలో హసన్ డియాబ్ దేశ ప్రధాని అయ్యారు. ఆయన ప్రభుత్వంపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొత్త మంత్రివర్గం ఏర్పడే వరకు కేర్ టేకర్ పాత్రలో కొనసాగాలని అధ్యక్షుడు మిచెల్ ఆవున్ డియాబ్ ప్రభుత్వాన్ని కోరారు.

ఎవదీ అదీబ్?

జర్మన్ మీడియా డీడబ్ల్యూ ప్రకారం.. ముస్తఫా అదీబ్ 2013 నుంచి జర్మనీలో లెబనాన్ రాయబారిగా ఉన్నారు. మాజీ ప్రధాని నజీబ్ మికాటికి సలహాదారుగా కూడా పనిచేశారు. లెబనీస్ రాజకీయ, శాఖల వ్యవస్థలో సున్నీ ముస్లింలు మాత్రమే ప్రధానులు కాగలరు.

బీరుట్ నౌకాశ్రయంలో నిలువచేసిన 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ పేలింది. ఇందులో 190 మంది మృతి చెందగా, 6,500 మంది గాయపడ్డారు. పేలుడు తీవ్రత 240 కిలోమీటర్ల వరకు కనిపించింది. ఈ ప్రమాదంలో 3 బిలియన్ డాలర్ల (రూ.22,540 కోట్లు) నష్టం జరిగినట్లు అంచనా. ఈ పేలుడుతో నగరంలోని మూడు లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.


logo