హమ్మయ్య.. ఉగ్రవాది ట్రంప్ వెళ్లిపోతున్నారు: ఇరాన్ అధ్యక్షుడు

టెహ్రాన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడంపై సంతోషం వ్యక్తం చేశారు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ. ఏమాత్రం కట్టుబాట్లు లేని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని, ఆయనో ఉగ్రవాది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ అధ్యక్షుడిగా వచ్చినందుకు తామేమీ సంబరపడటం లేదని, అయితే ట్రంప్ వెళ్లిపోతుండటం మాత్రం చాలా ఆనందాన్నిస్తోందని రౌహానీ అన్నారు. తన కేబినెట్‌తో బుధవారం మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హమ్మయ్య, ఇవి ట్రంప్ చివరి రోజులు. ఆయనో నియంత, పాలన తెలియని, ఎలాంటి కట్టుబాట్లు లేని అధ్యక్షుడు, ఓ ఉగ్రవాది, హంతకుడు అని ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రౌహానీ. ట్రంప్ స్థానంలో అధ్యక్షుడిగా వస్తున్న బైడెన్.. ఇరాన్‌తో మళ్లీ దౌత్యానికి సిద్ధమని ప్రకటించడం గమనార్హం.
తాను అధ్యక్ష పీఠం ఎక్కినప్పటి నుంచీ ఇరాన్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఆ దేశానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలను ఏకం చేయగలిగారు. 2018లో ఇరాన్‌తో ఉన్న న్యూక్లియర్ డీల్‌ను రద్దు చేసి, ఆ దేశంపై మళ్లీ ఆంక్షలు విధించారు. బాగ్దాద్ ఎయిర్పోర్ట్ దగ్గర వైమానిక దాడులు జరిపించి ఇరాన్ జనరల్ ఖాసిమ్ సులేమానీని హత్య చేయించారు. కనీసం వ్యాక్సిన్లను కూడా పొందకుండా ఇరాన్‌ను ట్రంప్ అడ్డుకున్నారని రౌహానీ ఆరోపించారు. కరోనా వల్ల ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. ఏకంగా 52 వేల మంది మృత్యువాత పడగా.. 11 లక్షల కేసులు నమోదయ్యాయి. ట్రంప్ దిగిపోయి బైడెన్ వస్తుండటంతో అమెరికాతో మరోసారి సత్సంబంధాల కోసం సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ సంకేతాలు పంపిస్తోంది.