సోమవారం 30 మార్చి 2020
International - Feb 09, 2020 , 01:56:07

థాయ్‌లాండ్‌లో నరమేధం

థాయ్‌లాండ్‌లో నరమేధం
  • జనంపై జవాన్‌ కాల్పులు 20 మంది మృతి, 14 మందికి గాయాలు

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జవాన్‌ జనంపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 20 మంది మరణించగా, 14 మంది గాయపడినట్లు ఆ దేశ పోలీసులు తెలిపారు. నాఖోన్‌ రాట్చసీమ నగరంలో శనివారం ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఆర్మీ శిబిరం వద్ద విధుల్లో ఉన్న సార్జెంట్‌ మేజర్‌ జక్రాపంత్‌ థొమ్మా తొలుత అక్కడ కాల్పులు జరుపగా ఒక సైనికుడు, ఓ మహిళ చనిపోయారని, మరో వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆర్మీ వాహనాన్ని అపహరించి టెర్మినల్‌ 21 షాపింగ్‌ మాల్‌ వద్దకు చేరుకుని మెషిన్‌గన్‌తో జనంపై కాల్పులు జరిపాడని వెల్లడించారు. నరమేధానికి ముందు జక్రాపంత్‌ ఆయుధాగారానికి వెళ్లి భారీగా ఆయుధాలను తన వెంట తీసుకెళ్లాడని స్థానిక మీడియా తెలిపింది. కాల్పుల తర్వాత షాపింగ్‌ మాల్‌లో సుమారు 16 మందిని అతడు నిర్బంధించినట్లు పేర్కొనగా అధికారులు ధ్రువీకరించలేదు. నరమేధం అనంతరం ఆ జవాన్‌ ఫేస్‌బుక్‌లో తన ఫోటోలతోపాటు పలు అంశాలను పోస్టు చేశాడు. కాగా, అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు సైనిక బలగాలు ప్రయత్నిస్తున్నాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.


logo