మంగళవారం 31 మార్చి 2020
International - Feb 10, 2020 , 03:12:01

ఉన్మాద జవాన్‌ హతం

ఉన్మాద జవాన్‌ హతం
  • ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపిన థాయ్‌లాండ్‌ ఆర్మీ
  • 30కి చేరిన మృతుల సంఖ్య
  • శనివారం నరమేధం సృష్టించిన జక్రపంత్‌ థొమ్మా
  • ప్రార్థనలతో మృతులకు నివాళి అర్పించిన జనం

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌లో శనివారం నరమేధం సృష్టించి 30 మందిని పొట్టనపెట్టుకున్న ఉన్మాద జవాన్‌ను ఆ దేశ ఆర్మీ హతమార్చింది. నాఖోన్‌ రాట్చసీమ నగరంలోని షాపింగ్‌మాల్‌లో జనంపై కాల్పులు జరిపి బీభత్సం సృష్టించిన సార్జెంట్‌ మేజర్‌ జక్రపంత్‌ థొమ్మాను కమాండోలు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టా రు. ఈ ఘటనతో 17 గంటలపాటు అక్కడ భీతావాహ పరిస్థితి నెలకొన్నది. సీనియర్‌ అధికారి ఇంట్లో పని చేస్తున్న జూనియర్‌ సైనికుడు జక్రపంత్‌ శనివారం మధ్యాహ్నం తొలుత జరిపిన కాల్పుల్లో     ఒక సైనికుడు, మరో ఇద్దరు మరణించారు. తర్వాత ఆయుధాగారంలోకెళ్లి ఎమ్‌ 60 మెషిన్‌గన్‌తోపాటు కొన్ని ఆయుధాలతోపాటు దొంగిలించిన వాహనంతో సెంటర్‌లోని టెర్మినల్‌ 21 షాపింగ్‌మాల్‌ వద్దకెళ్లాడు. వారాంతం కావడంతో అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న జనంపై మెషిన్‌గన్‌తో విచక్షణా రహితంగా జరిపిన కాల్పు ల్లో 13 ఏండ్ల బాలుడు సహా 25 మందికిపైగా చనిపోగా పలువురు గాయపడ్డారు. 


కాల్పుల వల్ల భయాందోళనతో సందర్శకులు, షాపింగ్‌కొచ్చినవారు తలోదిక్కున దాక్కుని, 6 గంటలకుపైగా బిక్కుబిక్కుమంటూ గడిపారు. కాగా, కాల్పులతో నరమేధానికి పాల్పడిన జక్రపంత్‌ ఆ ఫోటోలు, వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి పైశాచికానందం పొందాడు. తర్వాత అతడి ఖాతాను ఫేస్‌బుక్‌ తొలిగించింది. మరోవైపు అక్కడికి చేరుకున్న ఆర్మీ కమాండోలు, ప్రత్యేక పోలీసు దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, షాపింగ్‌మాల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు పంపాయి. ఆదివారం ఉదయం జక్రపంత్‌ను కాల్చి చంపారు. ఇలాంటి ఘటన ఎప్పుడూ జరుగలేదని థాయ్‌లాండ్‌ ప్రధాని ప్రయూత్‌ చాన్‌ ఓచా తెలిపారు. వ్యక్తిగత కారణాలవల్లే ఆ జవాన్‌ ఇలా ప్రవర్తించాడని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నరమేధం నుంచి తేరుకున్న నగర ప్రజలు ఆదివారం కొవ్వొత్తుల ర్యాలీలు, ప్రార్థనలు, జాగరణలతో మృతులకు నివాళి అర్పించారు.


logo
>>>>>>