గురువారం 09 జూలై 2020
International - Jun 11, 2020 , 21:34:25

తప్పుడు ప్రకటనలకు 1,446 ఏండ్ల జైలుశిక్ష

తప్పుడు ప్రకటనలకు 1,446 ఏండ్ల జైలుశిక్ష

బ్యాంకాక్‌‌: తప్పుడు ప్రకటనలతో మోసం చేశారన్న అభియోగాలపై ఇద్దరు వ్యక్తులకు థాయ్‌లాండ్‌ కోర్టు ఒకటి గురువారం 1,446 ఏండ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. అనంతరం వారికి విధించిన శిక్షలను ఇద్దరికి సగానికి అంటే 723 సంవత్సరాలకు తగ్గిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. థాయిలాండ్‌ చట్టాల ప్రకారం గరిష్ఠంగా 20 ఏండ్ల జైలుశిక్ష మాత్రమే విధించాలి. 

అపిచార్ట్‌ బోవార్న్‌బాన్‌చరాక్‌, ప్రాపసోర్న్‌ బోవార్న్‌బాన్ఛా కలిసి ఓ రెస్టారెంట్‌లో సీఫుడ్‌ అమ్ముతుండేవారు. గతేడాది వీళ్లు ఆన్‌లైన్‌లో ఓ కొత్త ఆఫర్‌ను ప్రారంభించారు. ముందుగా డబ్బు చెల్లించి వోచర్లు కొనుగోలు చేస్తే ఎక్కువ ఆహారాన్ని అందజేస్తామని ఆప్రకటనలో చెప్పారు. ఉదాహరణకు 10 మంది తినగలిగే చేపల ఆహారాన్ని కేవలం రూ.2,220కే అందజేస్తామని, బయట దీని ధర ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దీంతో దాదాపు 20 వేల మంది రూ.12 కోట్ల విలువైన వోచర్లను కొనుగోలు చేశారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్నందున ఇంతమందికి ఆహారాన్ని అందజేయలేమంటూ రెస్టారెంట్‌ను మూసివేశారు. డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పడంతో కొంతమంది ఎదురుచూశారు. మరికొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఇద్దరికి 1,446 ఏండ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. అయితే తప్పును అంగీకరించడంతో శిక్షను 723 ఏండ్ల చొప్పునకు తగ్గించింది. 


logo