ఆదివారం 31 మే 2020
International - Apr 28, 2020 , 15:39:36

అమెరికా రాష్ట్రాలు.. ఎవ‌రిదారి వారిదే

అమెరికా రాష్ట్రాలు.. ఎవ‌రిదారి వారిదే

కోవిడ్‌-19 వైర‌స్ అమెరికాలో ప్ర‌జ‌ల‌నే కాకుండా రాజ‌కీయ ప‌క్షాల‌ను కూడా ఎడ‌మొఖం పెడ‌మొఖంగా మార్చేసింది. అధ్య‌క్షుడు ట్రంప్ మొండివైఖ‌రికి ఇప్పుడు తీవ్రంగా న‌ష్ట‌పోతున్న ఆ దేశంలో ఆయ‌న మాట‌కు విలువ లేకుండా పోతున్న‌ది. ప్ర‌పంచం మొత్తంలో న‌మోదైన క‌రోనా కేసుల్లో ఒక్క అమెరికాలోనే 30శాతం ఉన్నాయి. అంతే స్థాయిలో మ‌ర‌ణాలు కూడా ఉన్నాయి. రోజూ వేలల్లో కొత్త కేసులు న‌మోదవుతున్నాయి. అయినా అధ్య‌క్షుడు ట్రంప్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టేందుకు లాక్‌డౌన్ ఎత్తేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల గ‌వర్న‌ర్లు సొంతంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. టెక్సాస్ గ‌వ‌ర్న‌ర్ గ్రెగ్ అబ్బాట్ రాష్ట్రంలో మాల్స్‌, రెస్టారెంట్లు, సినిమాహాళ్లు శుక్ర‌వారం నుంచి తెరుస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. 

అదే స‌మ‌యంలో కాలిఫోర్నియా గ‌వ‌ర్న‌ర్ గావిన్ న్యూస‌మ్ మాత్రం ప్ర‌జ‌లు ఇండ్ల‌నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ఆదేశించారు. రాష్ట్రంలోని ప‌లు బీచుల్లో వారాంతాల్లో జ‌నం నిండిపోయి ఉంటుండ‌టంతో ఆయ‌న తీవ్రంగా స్పందించారు. క‌రోనాను ఎదుర్కొనేందుకు ప్ర‌జ‌లంతా క‌లిసిక‌ట్టుగా ఓపిక‌గా ఉండాల‌ని కోరారు. ప‌లు ఇత‌ర రాష్ట్రాలు కూడా త‌మ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. అధ్య‌క్షుడు ట్రంప్ మాత్రం దేశం మొత్తం వెంట‌నే వ్యాపారాలు ప్రారంభించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. మ‌రో ఏడాదిలోపే అధ్య‌క్ష ఎన్నిక‌లు ఉండ‌టంతో దేశంలో సాధార‌ణ ప‌రిస్థితులు తెచ్చేందుకు ట్రంప్ తొంద‌ర‌ప‌డుతున్నారు. 


logo