మంగళవారం 26 మే 2020
International - May 23, 2020 , 10:08:22

మేడే.. మేడే.. మూడు చ‌క్క‌ర్లు కొట్టిన పాక్ విమానం

మేడే.. మేడే.. మూడు చ‌క్క‌ర్లు కొట్టిన పాక్ విమానం

హైద‌రాబాద్‌:  పాకిస్థాన్‌లోని క‌రాచీలో విమానం కూలిన ఘ‌ట‌న తెలిసిందే. ఆ ప్ర‌మాదంలో 97 మంది మృతిచెందారు. అయితే విమానం కూల‌డానికి ముందు.. ఎయిర్‌పోర్ట్ స‌మీపంలో రెండుమూడు సార్లు చ‌క్క‌ర్లు కొట్టిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. తొలుత ఆ విమానం ఓ మొబైల్ ట‌వ‌ర్‌ను ఢీకొట్టింది. ఆ త‌ర్వాత అది స‌మీపంలో ఉన్న ఇండ్ల‌పై కూలిన‌ట్లు సాక్షులు చెబుతున్నారు. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు ప్ర‌యాణికులు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ ఇద్ద‌ర్ని గుర్తించారు. వారిలో ఒక‌రు బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ ఉన్నారు. 

విమానంలోని పైల‌ట్‌.. ఏటీసీతో జ‌రిపిన సంభాష‌ణ‌ను కూడా రిలీజ్ చేశారు.  విమానాన్ని ల్యాండ్ చేయ‌డానికి పైల‌ట్ ఇబ్బందిప‌డిన‌ట్లు తెలుస్తోంది. స‌ర్ డైరెక్ట్‌గా వ‌స్తున్నాను, మా ఇంజిన్ ఫెయిల్ అయ్యింద‌ని పైల‌ట్ త‌న సంభాష‌ణ‌లో పేర్కొన్నాడు.  స‌ర్‌.. మేడే, మేడే, మేడే పాకిస్థాన్ 8303 అంటూ ఉండ‌గానే ట్రాన్స్‌మిష‌న్ కోల్పోయిన‌ట్లు ఏటీసీ అధికారులు చెప్పారు. అంత‌ర్జాతీయ విమానాల పైల‌ట్లు ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో మేడే.. మేడే అంటూ ఏటీసీతో సంభాషిస్తుంటారు.  రేడియో క‌మ్యూనికేష‌న్‌లో వాళ్లు ఇలా చెబుతుంటారు. అయితే ఈ ప్ర‌మాద ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ జ‌రిపించాల‌ని పాకిస్థాన్ పైల‌ట్ల సంఘం డిమాండ్ చేసింది. 

విమానం ఇండ్ల‌పై కూలిన ఘ‌ట‌న‌లోనూ ఆ ఇండ్ల‌ల్లో ఉన్న‌వారు కూడా గాయ‌ప‌డ్డారు. వారిలో ఒక‌ర్ని గుర్తించారు. మొత్తం 11 మంది గాయ‌ప‌డ్డారు. అనేక ఇండ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి. గాయ‌ప‌డ్డ‌వారిలో ఎక్కువ‌శాతం మంది మ‌హిళ‌లే ఉన్నారు.  శుక్ర‌వారం ప్రార్థ‌న‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. గాయ‌ప‌డ్డ‌వారంతా స్టేబుల్‌గా ఉన్నారు.   


logo