సోమవారం 23 నవంబర్ 2020
International - Nov 03, 2020 , 11:48:33

ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విజయవంతం

ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విజయవంతం

హైద‌రాబాద్ : 7వ ప్ర‌పంచ తెలుగు సాహితీ స‌ద‌స్సు విజ‌యోత్స‌వాలు విజ‌య‌వంతంగా ముగిశాయి. ఈ ఏడాది అక్టోబ‌ర్ 10, 11వ తేదీల్లో 36 గంట‌ల పాటు నిర్విరామంగా తెలుగు సాహితీ స‌ద‌స్సు స‌మావేశాలు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ స‌ద‌స్సును వంగూరి ఫౌండేష‌న్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక క‌ళా సార‌థి(సింగ‌పూర్‌), తెలుగు మల్లి (మెల్ బోర్న్, ఆస్ట్ఱేలియా), దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక (జొహాన్నెస్ బర్గ్), సీపీ బ్రౌన్ తెలుగు సమాఖ్య (లండన్) సంస్థల సంయుక్తంగా నిర్వహించాయి. 

తెలుగు సాహితీ స‌ద‌స్సు విజ‌యోత్స‌వ వేడుక‌లు అంత‌ర్జాలం వేదిక‌గా అక్టోబ‌ర్ 31న మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి సుమారు 8 గంట‌ల పాటు విజ‌యవంతంగా కొన‌సాగాయి.  


వంగూరి చిట్టెన్ రాజు విజ‌యోత్స‌వ వేడుక‌ల‌ను ప్రారంభించారు. ప్ర‌ముఖ గాయ‌ని సురేఖా మూర్తి దివాక‌ర్ల మా తెలుగు త‌ల్లికీ గీతం ఆల‌పించారు. ప్రముఖ సినీ నటులు, సాహితీవేత్త కే బ్రహ్మానందం సుమారు 45 నిముషాల పాటు ప్ర‌సంగించారు.  నన్నయ, పోతన, జాషువా, విశ్వనాథ, గురజాడ, శ్రీశ్రీ మొదలైన కవుల విశిష్టతని అలవోకగా ఉటంకించారు. యువతరం తెలుగు భాషని గౌరవించి, నేర్చుకోడానికి స‌రైన ప‌ద్ధ‌తిలో భాష‌ను విశ్లేషించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ కవితల నుంచి కొన్ని వాక్యాలని స్ఫూర్తిగా తీసుకుని తను వేసిన చితాలని బ్రహ్మానందం ప్ర‌ద‌ర్శించి, స‌భికుల మ‌న్న‌న‌లు పొందారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి రాధిక మంగిపూడి(సింగ‌పూర్‌), సుచిత్రా మూర్తి(కాకినాడ‌) క‌లిసి విజ‌యోత్స‌వ స‌భ‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించారు. సాహిత్య అంశాల మీద అక్కిరాజు భ‌ట్టిప్రోలు, చాగంటి కృష్ణ‌కుమారి, నోరి రాధిక‌తో పాటు 34 మంది వ‌క్త‌లు ప్ర‌సంగించారు. వ్యాపారంగా మారిన విద్య,  ప్రజల నిరాసక్తత, ప్రభుత్వాల వ్యతిరేక విధానాల వలన  తెలుగు భాషా, సాహిత్యం మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది అని స‌భికులు పేర్కొన్నారు.  


ఈ ముగింపు వేడుక‌ల్లో రత్న కుమార్ (సింగపూర్), డాక్ట‌ర్ జొన్నలగెడ్డ మూర్తి (ఇంగ్లండ్), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), వంశీ రామరాజు (హైదరాబాద్), రాధిక మంగిపూడి (సింగపూర్), శాయి రాచకొండ (హ్యూస్టన్), ప్రధాన సాంకేతిక నిపుణులలో రాధాకృష్ణ, సుధాకర్ జొన్నాదుల, భాస్కర్ ఊలపల్లి, శ్రీధర్ భరద్వాజ్, రాము చామిరాజు, పాతూరి రాంబాబు (సింగపూర్), లలిత రాచకొండ, ఇందిర చెరువు (అమెరికా), శేషేంద్ర శేష భట్టార్ (ఇంగ్లండ్), వేదిక నిర్వాహకులు దీప్తి, శ్రీనివాస్ పెండ్యాల, రాధిక నోరి, డా. కె.గీత (అమెరికా), గంగిశెట్టి లక్ష్మీ నారాయణ (తిరుపతి) సుచిత్ర (కాకినాడ) మొదలైన వారు తమ అనుభూతుల‌ను పంచుకున్నారు.   

  

Please subscribe to the newly created VFA You Tube Channel. 

https://www.youtube.com/watch?v=OXLoVspTnOM&t=21229s