సోమవారం 23 నవంబర్ 2020
International - Oct 30, 2020 , 16:57:12

‘నా పిల్లలను ప్రేమిస్తున్నాని చెప్పండి’: హత్యకు గురైన ఫ్రాన్స్‌ మహిళ చివరిమాటలు..!

‘నా పిల్లలను ప్రేమిస్తున్నాని చెప్పండి’: హత్యకు గురైన ఫ్రాన్స్‌ మహిళ చివరిమాటలు..!

పారిస్‌: ‘నా పిల్లలను ప్రేమిస్తున్నానని చెప్పండి’..ఇవి ఫ్రాన్స్‌లో ఉగ్రవాది చేతిలో హత్యకు గురైన ఓ మహిళ చివరిమాటలు..విద్యార్థులకు మహ్మద్‌ ప్రవక్త కార్టూన్లను చూపుతున్నాడనే నెపంతో ఉగ్రవాదులు ఓ స్కూల్‌ టీచర్‌ తల నరికిన ఘటన జరిగిన కొద్దిరోజులకే మరో ఉగ్రదాడి జరిగింది. దక్షిణ నైస్‌ నగరంలోని నోట్రే-డేమ్‌బాసిలికా ప్రాంతంలోగల చర్చి వద్ద ఓ దుండగుడు కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేశాడు. ఈ ఘటనలో 60 ఏళ్ల మహిళ, 55 ఏళ్ల చర్చి ఉద్యోగితోపాటు 44 ఏళ్ల బ్రెజిలియన్‌కు చెందిన మరో మహిళ మరణించారు. బ్రెజిలియన్‌ మహిళ చర్చినుంచి పారిపోయి రెస్టారెంట్‌ వద్ద కుప్పకూలిపోయింది. దుండగుడు కత్తితో ఆమె మెడపై గాయపర్చాడు. ఆమె చివరిమాటలు అక్కడున్నవారిని కదిలించాయి. మెడపై గాయాలైనా ఆమె పక్కవారిని అక్కడినుంచి పారిపోండంటూ అప్రమత్తం చేసిందని అధికారులు తెలిపారు. 

దుండగుడు అల్లాహూ అక్బర్‌ అని అరుస్తూ కత్తితో దాడులకు తెగబడ్డాడని అధికారులు పేర్కొన్నారు. అతడు ట్యునీషియాకు చెందిన 21 ఏళ్ల బ్రహిమ్ ఆయిసౌయిగా గుర్తించారు. ఇటీవలే యూరప్‌కు వచ్చినట్లు పేర్కొన్నారు. దాడి నేపథ్యంలో ఫ్రాన్స్‌ సర్కారు దేశంలో హై అలర్ట్‌ ప్రకటించింది. ఈ ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్‌కు అండగా ఉంటామని భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు.. సామాజిక మాధ్యమాల్లో ఫ్రాన్స్‌కు మద్దతుగా ‘ఐ స్టాండ్‌ విత్‌ ఫ్రాన్స్‌’ అన్న హాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అయింది.

ఫ్రాన్స్‌లో ఏం జరుగుతోంది...?

ఫ్రాన్స్‌లోని కాన్‌ఫ్లాన్స్‌-సెయింటే-హోనోరైన్‌ ప్రాంతంలో సామ్యూల్‌ పాటీ(47) అనే సాంఘిక ఉపాధ్యాయుడిని అబ్దౌల్లాఖ్‌ అబౌయేదొవిచ్‌ అంజోరోవ్‌ అనే ఉగ్రవాది ఈ నెల 16న  తల నరికి హత్య చేశాడు. మహ్మద్‌ ప్రవక్తపై వేసిన కార్టూన్లను విద్యార్థులకు చూపించాడనే నెపంతో అతడి తలనరికాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముష్కరుడిని కాల్చి చంపారు. ఉగ్రవాదంపై నిరసనగా ఫ్రాన్స్‌ సర్కారు కార్టూన్లను పెద్దసైజులో తయారుచేయించి ప్రభుత్వ భవనాలకు వేలాడదీసింది. అలాగే, దేశంలో రాడికల్‌ ఇస్లాంను సహించబోమని, దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రకటించారు. దీంతో ముస్లిం దేశాలన్నీ ఫ్రాన్స్‌పై భగ్గుమన్నాయి. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు మాక్రాన్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అలాగే, వారి దేశాల్లో ఫ్రాన్స్‌ ఉత్పత్తులను బహిష్కరించారు. ఇదిలా ఉండగా, అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉండాలని, విభజన స్ఫూర్తిని వదులుకోవద్దని అధ్యక్షుడు మాక్రాన్‌ పిలుపునిచ్చారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.