గురువారం 02 జూలై 2020
International - Jun 22, 2020 , 12:29:57

న్యూజిలాండ్‌ తెరపై తెలంగాణ దర్శకుడి సినిమా..

న్యూజిలాండ్‌ తెరపై తెలంగాణ దర్శకుడి సినిమా..

  • కరోనాపై విజయం సాధించిన న్యూజిలాండ్‌!
  • లాక్‌డౌన్‌ అనంతరం మొదటి సినిమాగా ‘మిస్టేక్‌’ విడుదల


న్యూజిలాండ్‌ : కరోనా వైరస్‌తో యావత్‌ ప్రపంచం అతలాకుతలమవుతుంటే న్యూజిలాండ్‌ మాత్రం వైరస్‌ వ్యాప్తికి విజయవంతంగా అడ్డుకట్ట వేసింది. లాక్‌డౌన్‌ను ఎత్తివేసి నిత్య కార్యకలాపాలను యధావిధిగా సాగిస్తోంది. కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రపంచ దేశాల్లో సినిమా థియేటర్లు బంద్‌ చేసి, షూటింగ్‌లను రద్దు చేశారు. న్యూజిలాండ్‌ మాత్రం వైరస్‌ను ఖతం చేసి లాక్‌డౌన్‌ ఎత్తేసి మళ్లీ షూటింగులు ప్రారంభించింది. దీంతో థియేటర్లు కూడా పునఃప్రారంభమయ్యాయి. అయితే అక్కడ తొలిసారిగా మిస్టేక్‌ (ఏక్‌గల్తీ) సినిమా విడుదలైంది. తెలంగాణకు చెందిన సినీ దర్శకుడు తుక్కాపురం సంతోశ్‌, సినిమాటోగ్రాఫర్‌, ఎడిటర్‌ వికాస్‌ దేవరకొండ కలిసి తీసిన ఈ సినిమా న్యూజిలాండ్‌ థియేటర్లలో లాక్‌డౌన్‌ అనంతరం తొలిసారిగా విడుదలై పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకోవడంతోవారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.  జూన్‌ 13న ఈ సినిమా విడుదల కాగా ప్రీమియర్‌ షోతోనే అక్కడి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమాలో ఆర్‌జే నసీర్‌, ఎం ఖాన్‌, యోష్టాసింగ్‌ ప్రధాన తారాగణం. ఈ మూవీని అక్కడి పార్లమెంటియన్లు వీక్షించి చిత్ర దర్శకుడు, సినిమాటోగ్రాఫర్లకు అభినందనలు తెలిపారు. న్యూజిలాండ్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలను చూసి రాష్ట్ర ప్రజలు గర్వపడుతున్నారు.
logo