మంగళవారం 31 మార్చి 2020
International - Mar 19, 2020 , 02:20:36

2 లక్షల మందికి వైరస్‌

2 లక్షల మందికి వైరస్‌

  • 8,908కు చేరిన కరోనా మృతులు
  • ఇటలీలో ఒక్కరోజే 475 మంది మృతి 

టెహ్రాన్‌/మాడ్రిడ్‌: కరోనా దెబ్బకు ప్రపంచం విలవిల్లాడుతున్నది. మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 8,908 మంది మరణించగా, వైరస్‌ సోకిన వారి సంఖ్య 2,16,000 దాటింది. కోలుకున్న వారి సంఖ్య 84వేలకు చేరుకున్నది. ఇటలీలో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 475 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకూ ఆ దేశంలో మృతుల సంఖ్య 2,978కు చేరింది. మరోవైపు, కరోనా బాధితులతో ఇటలీలోని దవాఖానల్లోని ఐసీయూలు నిండిపోతున్నాయి. కొత్త బాధితుల్ని చేర్చుకోవడం అధికారులకు తలకుమించిన భారంగా మారుతున్నది. దీంతో టురిన్‌ నగరంలో కరోనా బాధితులకు ప్రోటోకాల్‌ సిద్ధం చేశారు. 

దాని ప్రకారం 80 ఏండ్లు పైబడిన వారికి వైద్యసాయం నిలిపివేయాలని అనుకుంటున్నారు. ఇరాన్‌లో కరోనాతో బుధవారం 147 మంది చనిపోయారు. దీంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 1,135కు చేరింది. శుక్రవారం నౌరజ్‌ (పర్షియన్‌ కొత్త సంవత్సరం) నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇండ్లకే పరిమితం కావాలన్న ప్రభుత్వం హెచ్చరికల్ని ప్రజలు పాటించకపోవడంపై ఇరాన్‌ డిప్యూటీ ఆరోగ్య శాఖ మంత్రి అలిరిజా రైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విషయంలో ఇరాన్‌ ఆలస్యంగా మేల్కొన్నదని వస్తున్న విమర్శలను ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ తోసిపుచ్చారు.  కరోనా నేపథ్యంలో సౌదీ అరేబియా, కువైట్‌, యూఏఈ వంటి దేశాలు శుక్రవారం ప్రార్థనల్ని రద్దు చేశాయి. ప్రజలందరూ ఇండ్లకే పరిమితం కావాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం హెచ్చరించింది.   

స్పెయిన్‌లో 24 గంటల్లో 107 మంది మృతి..

కరోనాతో స్పెయిన్‌లో గత 24 గంటల్లో 107 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 598కు చేరుకున్నది. వైరస్‌ సోకిన వారి సంఖ్య 13,716కి పెరిగింది. దేశ రాజధాని మాడ్రిడ్‌లో అత్యధికంగా 390 మంది(66%) మరణించారని ప్రభుత్వం తెలిపింది. ఫ్రాన్స్‌లో కరోనాతో బుధవారం ఒక్కరోజే 89 మంది మరణించారు. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 264కు చేరింది. దక్షిణాఫ్రికాలో బుధవారం ఒక్కరోజే 31 మందికి వైరస్‌ సోకింది. దీంతో ఆ దేశంలో వైరస్‌ సోకినవారి ఈ సంఖ్య 116 చేరింది. 


logo
>>>>>>