బుధవారం 03 జూన్ 2020
International - Apr 10, 2020 , 01:47:23

టెడ్రోస్‌ పాపమేనా?

టెడ్రోస్‌ పాపమేనా?

  • కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందే ఎందుకు హెచ్చరించలేదు!
  • చైనా ఒత్తిడికి తలొగ్గిన సంస్థ డైరెక్టర్‌ జనరల్‌!
  • అమెరికా అధ్యక్షుడి ఆగ్రహానికి కారణం ఇదేనా?
  • టెడ్రోస్‌కు జిన్‌పింగ్‌తో సన్నిహిత సంబంధాలు!
  • ఇథియోపియాలో చైనా పెట్టుబడుల్లో క్విడ్‌ ప్రో కో!

వైరస్‌ వెలుగుచూసిన తొలిరోజుల్లోనే డబ్ల్యూహెచ్‌వో దగ్గర సమాచారం ఉన్నప్పటికీ..  మమ్మల్ని అప్రమత్తం చేయడంలో విఫలమైంది. డబ్ల్యూహెచ్‌వోకు అందిస్తున్న నిధులను నిలిపివేస్తాం. వైరస్‌ నేపథ్యంలో చైనాకు ఎవ్వరూ ప్రయాణించవద్దని సూచించా.. కానీ నా నిర్ణయాన్ని డబ్ల్యూహెచ్‌వో విమర్శించింది. ఇది పెద్ద తప్పు.  అది చైనాకు అనుకూలంగా వ్యహరిస్తున్నది.                                                                                 - అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచదేశాలు, ప్రజల ఆరోగ్యం విషయంలో సదా అప్రమత్తంగా ఉంటూ ఏదైనా కొత్త వ్యాధి పుట్టుకొచ్చినప్పుడు ఆ విషయాన్ని అందరికీ తెలియజేసి, హెచ్చరికలు జారీచేయడం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బాధ్యత. కానీ కరోనా విషయంలో అది పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసినప్పటికీ ఆ సమాచారాన్ని ఇతర దేశాలతో అది పంచుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఈ వాదనను మరింత బలపరుస్తున్నాయి. కరోనా వైరస్‌పై ప్రపంచదేశాలను అప్రమత్తం చేసే విషయంలో డబ్ల్యూహెచ్‌వో ఉద్దేశపూర్వకంగానే జాప్యంచేసిందని, దీని వెనుక చైనా హస్తం ఉన్నదనేది ఆరోపణల సారాంశం. డబ్ల్యూహెచ్‌వో కార్యకలాపాలన్నీ దాని డైరెక్టర్‌ జనరల్‌ కనుసన్నల్లోనే సాగుతుంటాయి. చైనా ప్రాపకంతో డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులైన ఇథియోపియా దేశస్థుడు డాక్టర్‌ టెడ్రోస్‌ అధనోం గేబ్రియేసెస్‌.. వుహాన్‌లో కరోనా విజృంభిస్తున్న విషయాన్ని మొదట్లో తొక్కిపెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయంగా తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న చైనా రాజకీయ కారణాలతోనే డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌గా డాక్టర్‌ టెడ్రోస్‌ను ప్రతిపాదించినట్టు చెప్తుంటారు. ఆ కృతజ్ఞతతోనే డాక్టర్‌ టెడ్రోస్‌ కరోనా వైరస్‌ విషయంలో చైనా ఒత్తిడికి తలొగ్గారన్న ఆరోపణలు వస్తున్నాయి.

డాక్టర్‌ కాని డాక్టర్‌

ఎంతో కీలకమైన డబ్ల్యూహెచ్‌వో అధిపతిగా వైద్యరంగానికి చెందిన నిపుణులను నియమించడం ఆనవాయితీగా వస్తున్నది. డబ్ల్యూహెచ్‌వో తొలి డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జార్జ్‌బ్రోక్‌ చిషోం మొదలు 2017 వరకు పనిచేసిన డాక్టర్‌ మార్గరెట్‌చాన్‌ వరకు అందరూ వైద్యరంగంలో అపార అనుభవం ఉన్నవారే. డాక్టర్‌ టెడ్రోస్‌ మాత్రం వైద్య శాస్త్రం చదివిన వ్యక్తి కాదు. ఆయన కమ్యూనిటీహెల్త్‌లో పీహెచ్‌డీ, ఇమ్యునాలజీ ఆఫ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌లో ఎంఎస్సీ చేశారు. అంటే మొదటిసారిగా డబ్ల్యూహెచ్‌వో పగ్గాలు ఒక డాక్టర్‌ కాని డాక్టర్‌కు అప్పగించారన్నమాట!

టెడ్రోస్‌కు రాజకీయ నేపథ్యం

ఇథియోపియాలో 1991 నుంచి కమ్యూనిస్టు ప్రభుత్వం పాలిస్తూ ఉన్నది. ఆ ప్రభుత్వంలో డాక్టర్‌ టెడ్రోస్‌ 2005 నుంచి 12 వరకు ఆరోగ్యశాఖ మంత్రిగా, 2012-16 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఈ కాలంలోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు సన్నిహితుడిగా మారినట్టు సమాచారం. ఈ సాన్నిహిత్యమే 2017లో డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌గా డాక్టర్‌ టెడ్రోస్‌ ఎన్నికయ్యేందుకు కారణమైందన్న అభిప్రాయాలు ఉన్నాయి. 

క్విడ్‌ ప్రో కో!

ఇథియోపియాలో విదేశాలు పెట్టే పెట్టుబడుల్లో చైనావి 60శాతం వరకు ఉన్నట్టు తెలుస్తున్నది. డబ్ల్యూహెచ్‌వోకు తనకు అనుకూలమైన వ్యక్తిని చీఫ్‌గా నియమించాలని భావిస్తున్న చైనా.. తన చెప్పుచేతుల్లో ఉండే ఇథియోపియాకు చెందిన వ్యక్తిని ప్రతిపాదించాలని నిర్ణయించిందని, ఈ ఎత్తుగడతోనే డాక్టర్‌ టెడ్రోస్‌ను ముందుకు తీసుకువచ్చిందని అంటున్నారు. డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌గా డాక్టర్‌ టెడ్రోస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇథియోపియాలో సంస్థ కార్యాలయ నిర్మాణాన్ని 12 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో చేపట్టారు. ఈ నిర్మాణానికి చైనా కొన్ని నిధులిస్తున్నట్టు తెలుస్తున్నది. డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా 40 మిలియన్‌ డాలర్ల నిధులను అందిస్తుండగా, చైనా 44 మిలియన్‌ డాలర్లను సమకూరుస్తున్నది. అధిక నిధులిస్తున్నామన్న నెపంతోనే డాక్టర్‌ టెడ్రోస్‌ను డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌గా ప్రతిపాదించిందన్న అభిప్రాయం ఉన్నది. ఈ నేపథ్యంలోనే డాక్టర్‌ టెడ్రోస్‌ చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నప్పటికీ ఆ విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి వెల్లడించలేదని, ఇది క్విడ్‌ ప్రో కో లాంటిదేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

డబ్ల్యూహెచ్‌వో ప్రతిష్ఠకు దెబ్బ

అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌.. కరోనా వైరస్‌ విస్తృతి విషయంలో బాధ్యతరాహిత్యంగా వ్యవహరించారు. ఆయన చైనాకు అనుకూలంగా వ్యవహరించినట్టుగా ఇప్పటివరకు జరిగిన పరిణామాలు తెలుపుతున్నాయి. ఇథియోపియా కమ్యూనిస్టు ప్రభుత్వంలో పనిచేసిన డాక్టర్‌ టెడ్రోస్‌ను డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌గా నియమించడం వెనుక చైనా హస్తం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇటువంటి చర్యలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిష్ఠ దెబ్బతింటుంది, దానిపై ప్రజలకున్న నమ్మకం సడలిపోతుంది.

- డాక్టర్‌ వ్యాకరణం నాగేశ్వర్‌రావు, పల్మనాలజిస్ట్‌, మెడికల్‌ జర్నలిస్ట్‌logo