గురువారం 04 జూన్ 2020
International - May 20, 2020 , 15:31:13

అంతరించిన ప్రాణి ఆఖరి వీడియో చూశారా?

అంతరించిన ప్రాణి ఆఖరి వీడియో చూశారా?

న్యూఢిల్లీ: ఆ జీవి అంతరించిపోయి చాన్నాళ్లు అయింది. 1935లో చివరిసారిగా ఆ జాతికి చెందిన చివరి ప్రాణిని ఫిల్ము తీశారు. తవ్వకాల్లో బయటపడ్డ ఆ ఫిల్మును 4కే వీడియో రూపంలో విడుదల చేస్తే నెటిజనులు కళ్లింత చేసుకున చూస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆ ప్రాణికి థైలాసీన్ అని పేరు. వీపు మీద పులి చారల్లాంటివి ఉండడం వల్ల టాస్మేనియన్ టైగర్‌గా పాపులర్ అయింది. నిజానికి ఇది ఎలుకజాతికి చెందిన ప్రాణి.

బ్యూమారిస్ జూలో 1935లో తీసిన డాక్యుమెంటరీ ఫిల్ములో బెంజమిన్ అనే పేరుగల చివరి థైలాసీన్ కదలికలు చిత్రీకరించారు. అది తన బోనులో అటూఇటూ తిరుగుతూ ఉంటే ఎవరో దానిని అదిలించేందుకు కర్రతో తట్టడం వినిపిస్తుంది. వాయిస్ ఓవర్‌లో 'ఇది (థైలాసీన్) చాలా అరుదైన ప్రాణి.. నాగరికత విస్తరణతో ఇది తన గూడును కోల్పోయింది' అనే మాటలు వినిపిస్తాయి. ఈ ఫిల్మును తీసిన 18 మాసాల తర్వాత బెంజమిన్ 1936 సెప్టెంబర్ 7న కన్నుమూసింది. ఆ తర్వాత మరో థైలాసీన్ లేదా టాస్మేనియన్ టైగర్ కనిపించలేదు. మొత్తం 21 సెకన్ల వీడియోను ఆస్ట్రేలియా నేషనల్ ఫిల్మ్ అండ్ సౌండ్ ఆర్కైవ్స్ ట్విట్టర్‌లో విడుదల చేసింది. దీనికి 86 వేల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. చాలామంది థైలాసీన్ ను చూడగలిగినందుకు హర్షం ప్రకటిస్తే కొందరు మాత్రం అంతరించిపోవడం పట్ల బాధను వ్యక్తం చేశారు.


logo