శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Sep 06, 2020 , 02:31:59

భారతీయ మహిళలు కురూపులు!

భారతీయ మహిళలు కురూపులు!

  • శృంగారం గురించి వాళ్లకు అసలు తెలియదు 
  • అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ ప్రేలాపనలు
  • ఆడియో టేపుల ద్వారా విషయం వెలుగులోకి..

వాషింగ్టన్‌: జాత్యహంకారం జూలు విదిల్చింది. అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా అత్యున్నతమైన పదవిలో కొనసాగిన ఓ వ్యక్తి భారతీయ మహిళలను అసభ్యపదజాలంతో కించపరిచాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ భారతీయ మహిళలను, పురుషులను కించపరిచేలా మాట్లాడిన ఆడియో టేపులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలో భారతీయ మహిళలే అత్యంత అందవిహీనంగా ఉంటారని, అసలు వాళ్లు పిల్లలను ఎలా కంటారో తనకు అర్థంకావడంలేదని నిక్సన్‌ కారుకూతలు కూశాడు. ఈ విషయాల్ని అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గేరీ బాస్‌ ‘న్యూయార్క్‌ టైమ్స్‌'లో ‘ది టెర్రిబుల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ప్రెసిడెన్షియల్‌ రేసిజమ్‌' పేరిట ఇచ్చిన ఒపీనియన్‌ పోల్‌లో వివరించారు. 1969-74 మధ్య కాలంలో అమెరికా 37వ అధ్యక్షుడిగా రిచర్డ్‌ నిక్సన్‌ పనిచేశారు. 1971, జూన్‌లో శ్వేతసౌధంలో జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిసింజర్‌తో నిక్సన్‌.. భారతీయులపై ముఖ్యంగా భారతీయ మహిళలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. ‘బ్లాక్‌ ఆఫ్రికన్లలోనైనా కొద్దిగా ఆకర్షణ ఉంటుంది కానీ భారతీయ మహిళలు చూడటానికి అందవిహీనంగా ఉంటారు’ అంటూ నిక్సన్‌ పేర్కొన్నాడు. 1971, నవంబర్‌ 4న అమెరికాలోని శ్వేతసౌధంలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ నిక్సన్‌తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో జాత్యహంకార వైఖరిని కిసింజర్‌తో  వ్యక్తం చేశాడని బాస్‌ తెలిపారు. 

నిక్సన్‌ ఓ అనాగరికుడు 

భారతీయులపై రిచర్డ్‌ నిక్సన్‌ చేసిన వ్యాఖ్యల మీద భారత మజీ దౌత్యవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిక్సన్‌ విలువలు లేని వ్యక్తి అని విదేశాంగ మాజీ మంత్రి నట్వర్‌ సింగ్‌ పేర్కొన్నారు.  నిక్సన్‌ ఓ అనాగరికమైన వ్యక్తి అని కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ అభివర్ణించారు.


logo